ఉక్రెయిన్ భూభాగాలపై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా దళాలపై కీవ్ సేనలు ప్రతిదాడులకు దిగాయి. జెలెన్‌స్కీ సేనలు చేసిన వరుస దాడుల్లో రష్యా.. ఒక్క రోజులోనే భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయినట్లు తెలుస్తోంది. సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులే లక్ష్యంగా చేసిన దాడుల్లో వెయ్యి మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై దాడి కోసం రష్యా ఇటీవల వేలాదిమంది సైనికులను ముందు వరుసలో కొత్తగా మోహరించింది. వీరిలో చాలా మంది రిజర్విస్టులే. అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ రక్షణ నిఘా వర్గాల నిపుణులు వెల్లడించారు. ఈ సమాచారంతో పక్కా వ్యూహాలు రచించిన ఉక్రెయిన్ వారిపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక్కరోజులోనే కనీసం 1000 మంది క్రెమ్లిన్ సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం... ఒక్క రోజే వెయ్యి మంది పుతిన్ సేనలు మృతి - రష్యా ఉక్రెయిన్ యుద్దం
ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యా సేనలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కరోజులోనే వెయ్యి మంది రష్యా సైనికులు మరణించినట్లు.. ఉక్రెయిన్ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మోహరించిన రిజర్విస్టులే లక్ష్యంగా ఎదురుదాడికి దిగిన జెలెన్‌స్కీ సేనలు.. పుతిన్ సేనలకు భారీ నష్టాన్ని కలిగించాయి.
ఉక్రెయిన్‌పై చేస్తున్న దండయాత్రలో ఇప్పటివరకు 71వేల మంది రష్యా సైనికులు మరణించినట్లు జెలెన్‌స్కీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఒక్కరోజులోనే వెయ్యిమంది సైనికులు మరణించారన్న ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటనపై ఇప్పటివరకూ రష్యా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కోసం ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అనేక మంది రిజర్విస్టులను వెనక్కి పిలిపించి ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపించారు. ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నట్లు రష్యా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కెర్చ్ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్-రష్యా మధ్య పరిస్థితులు మరింత తీవ్రరూపు దాల్చాయి. ఈ పేల్చివేతకు ప్రతీకారంగా ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దళాలు పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో కీవ్ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.