Russia Ukraine Crisis: నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌక ఒకటి తీవ్రంగా దెబ్బతింది. దానిపైకి రెండు క్షిపణులను గురిపెట్టి తామే దెబ్బ తీసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దానిని రష్యా తోసిపుచ్చింది. లోపల ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలి 'మాస్క్‌వా' అనే ఈ నౌక దెబ్బతిందని వివరణ ఇచ్చింది. యుద్ధం క్రమంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల వైపు మళ్లి, మేరియుపొల్ నగరం చుట్టూ కేంద్రీకృతమైన నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రష్యాకు పెద్ద దెబ్బే. ఈ నౌకలో దాదాపు 500 మంది వరకు నావికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే వారినందరినీ హుటాహుటిన బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తింది. మంటల్ని అదుపు చేశామనీ, క్షిపణి లాంఛర్లు దెబ్బతినలేదని, నౌకను రేవుకు చేరుస్తామని రష్యా తెలిపింది. యుద్ధ రంగం నుంచి దీనిని తొలగించాల్సి రావడం వల్ల నల్ల సముద్రంలో నిప్పుల వర్షం కురిపించే సామర్థ్యం రష్యాకు గణనీయంగా తగ్గిపోతుందని సైనిక విశ్లేషకులు చెబుతున్నారు. నష్టం ఎంతనేది పక్కనపెడితే.. ఎలాంటి ఎదురుదాడి ఘటనైనా రష్యా ప్రతిష్ఠను మసకబారుస్తుందని, యుద్ధం మొదలై ఏడు వారాలు దాటినా ఉక్రెయిన్‌ను జయించలేకపోవడం చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుందని వారు పేర్కొంటున్నారు. నౌక పరిస్థితి ఏమిటనేది వెంటనే అంచనాకు రావడం సాధ్యం కాలేదు. భిన్న వాదనలు వినిపిస్తుండడం, మేఘాలు దట్టంగా ఆవరించి ఉండడం వల్ల కేవలం ఉపగ్రహ చిత్రాలతో స్పష్టత రావడం లేదు. క్రిమియా ద్వీపకల్పం నుంచి ఆదివారం ఈ నౌక బయల్దేరినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ వర్గాలు ఈ నౌకపైకి రెండు 'నెప్ట్యూన్' క్షిపణులు ప్రయోగించి, పెను నష్టం కలిగించినట్లు ఒడెసా ప్రాంత గవర్నర్ మేక్‌సిమ్ మర్చెంకో చెప్పారు. ఈ నౌక మునిగిపోయిందని, ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశమని ఉక్రెయిన్ అధ్యక్షుని సలహాదారుడు ఒలెక్సీ అరెస్టోవిచ్ పేర్కొన్నారు. గత నెలలో అజోవ్ సముద్రంలో యుద్ధ ట్యాంకుల వాహక నౌక 'ఒర్స్స్'పై ఉక్రెయిన్ దాడి చేసినప్పుడు అది కాలిపోయింది. ఇప్పుడు మరో దెబ్బ అంతకంటే తీవ్రంగా తగిలింది.
రష్యాకు అనూహ్య నష్టం.. భారీ యుద్ధనౌక ధ్వంసం - russia ukraine crisis news
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి సంబంధించిన 'మాస్క్‌వా' యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతింది. పేలుడు పదార్థాలు పొరపాటున పేలడమే దీనికి కారణమని రష్యా వివరణ ఇచ్చింది. తామే దానిపై క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది.
18 తర్వాత కీలక నిర్ణయాలు:ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం అనేక వర్థమాన దేశాలకు దెబ్బ అని ఐరాస పేర్కొంది. ఇప్పటికే ఆ దేశాలు ఇంధన ధరలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయని, ఆహారం పరంగానూ సమస్యలు ఎదురవుతున్నాయని సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ప్రస్తుతం 170 కోట్ల మంది ప్రజలు ఆహారం, ఇంధన ధరలు, ఆర్థిక అంశాలతో ఇబ్బందుల పాలయ్యారని చెప్పారు. ఈ నెల 18 నుంచి 24 వరకు జరిగే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)ల సమావేశాలు పలు నిర్ణయాలకు కీలకం కానున్నాయని చెప్పారు. ఐరాసలో నాలుగు కమిటీలకు జరిగిన ఎన్నికల్లోనూ రష్యా ఓడిపోయింది. ఆ దేశం ఏకాకి అవుతోందని ఐరాసలో యూకే మిషన్ వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:ఎటు చూసినా విధ్వంసమే.. ఎవర్ని కదిలించినా విషాదమే..