Russia Ukraine war: రష్యా కమాండర్ యుద్ధ నేరాలకు పాల్పడ్డాడన్న అభియోగంపై విచారణ చేపట్టిన ఉక్రెయిన్ న్యాయస్థానం.. ఆ సైనికుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. యుద్ధ నేరాలపై చేపట్టిన తొలి కేసు విచారణలో భాగంగా సామాన్య పౌరుడిని చంపినందుకు రష్యన్ యుద్ధ కమాండర్‌కు ఈ శిక్ష విధించింది. ఉక్రెయిన్ దళాలకు పట్టుబడిన మాస్కో సైనికుడు సార్జంట్ వాడిమ్ షిషిమరిన్.. ఫిబ్రవరి 28న చుపాఖివ్కాలో 62 ఏళ్ల ఒలెక్సాండర్ షెలిపోవ్‌ను చంపినందుకు ఈ శిక్ష విధించారు.
విచారణలో భాగంగా షెలిపోవ్‌ను కాల్చి చంపినట్లు అంగీకరించిన 21 ఏళ్ల షిషిరిన్.. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా వ్యవహరించానని తెలిపాడు. తనను క్షమించమని షెలిపోవ్ భార్యను షిషిరిన్ అభ్యర్థించాడు. ఈ సమయంలో మీరు ఎవర్ని రక్షించేందుకు ఈ దాడి చేస్తున్నారని షెలిపోవ్ భార్య.. షిషిరిన్‌ను ప్రశ్నించారు. తన భర్తను చంపి మమ్మల్ని రక్షిస్తారా అని నిలదీశారు. దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వని రష్యా సైనికుడు.. ఆమెను మరోసారి క్షమించమని అడిగాడు. ఈ కేసు గురించి క్రెమ్లిన్‌కు ఎటువంటి సమాచారం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. తమ దేశంలో రష్యా 11 వేల కంటే ఎక్కువ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న ఉక్రెయిన్.. వాటిపై దర్యాప్తు చేస్తోంది. చాలామంది రష్యా సైనికులు ఉక్రెయిన్ అదుపులో ఉండడం వల్ల వారిని యుద్ధ నేరాల కింద విచారిస్తోంది.