ఉక్రెయిన్పై రష్యా క్షిపణులు మరోసారి విరుచుకుపడ్డాయి. ఒడెశా, చెర్కసీ, క్రీవీ రిహ్ సహా పలు నగరాలపై జరిగిన ఈ దాడులు ఆయా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయని, పలువురు పౌరులు మృతి చెందారని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందని వివరించారు. మిస్సైల్ దాడితో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిందని ఒడెశాలోని స్థానిక జల పంపిణీ సంస్థ వెల్లడించింది. దీంతో నగరం మొత్తానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపింది.
"ఉక్రెయిన్ భూభాగంపై శత్రువు మరోసారి క్షిపణులతో దాడికి పాల్పడ్డాడు" అని అధ్యక్ష కార్యాలయ ఉపాధ్యక్షుడు కిరిలో టిమోషెంకో సామాజిక మాధ్యమం టెలిగ్రామ్లో తెలిపారు. రష్యా దాడులపై దేశమంతటా అప్రమత్తత ప్రకటించి..సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ రష్యాలోని భూభాగం, కాస్పియన్, నల్ల సముద్రాల్లోని యుద్ధ నౌకలు, ఆ దేశ వ్యూహాత్మక బాంబర్ల నుంచి క్షిపణుల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం అధికార ప్రతినిధి యూరి ఇహ్నాత్ పేర్కొన్నారు. అయితే రష్యా ప్రయోగించిన మొత్తం 70 క్షిపణుల్లో 60 మిస్సైళ్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన అధికారులు వెల్లడించారు.
టీయూ-95, టీయూ-160ల స్థావరంలో పేలుడు?
ఇదిలా ఉండగా రష్యాలోని రెండు వైమానిక స్థావరాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే ఈ పేలుళ్లకు కారణాలేమిటన్నది ఇటు ఉక్రెయిన్, అటు రష్యా అధికారులు వెల్లడించలేదు. రియాజన్ వైమానిక స్థావరంలో చమురు ట్రక్కు పేలిపోయిన సందర్భంగా ముగ్గురు సైనికులు మృతి చెందారని, ఆరుగురు గాయపడ్డారని, ఓ విమానం దెబ్బతిన్నట్లు ఆర్ఐఏ నోవోస్తీ వార్తా సంస్థ వెల్లడించింది.