తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రసూతి వార్డుపై రష్యా దాడి.. చిన్నారి మృతి.. మరో ఘటనలో ముగ్గురు పౌరులు.. - putin

ఉక్రెయిన్​పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరొజియా విల్నాయన్స్క్‌ నగరంలో ఉన్న ప్రసూతి వార్డుపై రష్యా క్షిపణి దాడి చేసింది. అనంతరం రాజధాని కీవ్​ నగరంపై క్షిపణుల డ్రోన్​లతో విరుచుకుపడింది.

russia attacks ukraine
ఉక్రెయిన్‌ ప్రసూతి వార్డుపై రష్యా దాడి

By

Published : Nov 23, 2022, 10:51 PM IST

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరొజియా విల్నాయన్స్క్‌ నగరంలో ఉన్న ప్రసూతి వార్డుపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి నుంచి వైద్యులు తప్పించుకొన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జపొరొజియా మిలటరీ అడ్మినిస్ట్రేషన్‌ కథనం ప్రకారం తెల్లవారుజామున రష్యా దళాలు రాకెట్లతో తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించాయి. ఈ దాడిలో ప్రసూతి వార్డు మొత్తం ధ్వంసమైనట్లు పేర్కొంది.

రష్యా దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ ఖండించారు. ఈ దాడి నుంచి తల్లి, వైద్యులు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఉగ్రవాద దేశం తమ దేశ ప్రజలు, ప్రజా ఆస్తులపై దాడులకు పాల్పడుతోందని జెలెన్‌స్కీ అభివర్ణించారు. ‘‘శత్రువు ఈ తొమ్మిది నెలల్లో ఏమి సాధించలేకపోయాడో దానిని అందుకోవడానికి హత్యలు, ఉగ్రవాదంతో యత్నిస్తున్నాడు. కానీ, అతడు దానిని అందుకోలేడు. ఈ రాక్షసత్వానికి మాత్రం పూర్తి బాధ్యుడిగా నిలుస్తాడు’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్​ మౌలిక వసతులపైన దాడి చేసింది రష్యా. ఇప్పటికే ధ్వంసమైన ఉక్రెయిన్‌ విద్యుత్తు వ్యవస్థలపై రష్యా వైమానిక దాడులు జరిపింది. తాజా దాడులతో తూర్పు నుంచి పశ్చిమ వరకు అంధకారం నెలకొనట్లు కీవ్‌ అధికారవర్గాలు తెలిపాయి. తమను దెబ్బతీసే ఉద్దేశంతో శీతాకాలంలో విద్యుత్తు వ్యవస్థలు వంటి మౌలిక సదుపాయాలపై రష్యా వరుసదాడులు నిర్వహిస్తున్నట్లు కీవ్‌ అధికారులు ఆరోపించారు. పునరుద్దరణ కోసం పనులు జరుగుతున్నట్లు వారు వెల్లడించారు. కాగా రాజధాని కీవ్​ నగరంపై క్షిపణుల డ్రోన్​లతో విరుచుకుపడింది. రెండంతస్థుల భవనంపై మాస్కో సేనలు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు చనిపోయినట్లు పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details