Ukraine Crisis: ఎడాపెడా క్షిపణుల మోత. ఫిరంగి గుళ్లతో నేలమట్టమవుతున్న భవనాలు. పంతం వీడకుండా పోరాడుతున్న ఇరుపక్షాలు. కొనసాగుతున్న నరమేధం.. ఇదీ ఉక్రెయిన్‌లో సోమవారం నాటి పరిస్థితి. ఓడరేవు నగరమైన మేరియుపొల్‌ను దాదాపు గుప్పిట పట్టామని రష్యా ప్రకటించిన తర్వాత కూడా అక్కడ పోరాటం కొనసాగుతోంది. తమవాళ్లను పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడానికి ప్రత్యేక గదుల్ని (టార్చర్ ఛాంబర్లను) రష్యా ఏర్పాటు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. లివివ్ నగరంపై జరిగిన క్షిపణి దాడిలో కనీసం ఏడుగురు, ఖర్కివ్‌పై గుళ్లమోతలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మేరియుపొల్‌లో మిగిలిన సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు తమకు లొంగిపోవాలని రష్యా విధించిన గడువును ఉక్రెయిన్ పట్టించుకోలేదు. దీంతో ఆ సైనికులు తలదాచుకున్న ఉక్కు కర్మాగారం సహా అనేకచోట్ల భారీగా పోరు కొనసాగింది. ఉక్రెయిన్ వాసులు తలదాచుకున్న ఓ హోటల్ తీవ్రంగా దెబ్బతింది. వైమానిక స్థావరం ఉన్న వసిల్‌కీవ్ నగరంలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది.
Ukraine Crisis: రష్యా క్షిపణుల ప్రయోగం.. 13 మంది మృతి - రష్యా న్యూస్
Ukraine Crisis: మేరియుపొల్‌లో తమవాళ్లను పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడానికి ప్రత్యేక గదుల్ని (టార్చర్ ఛాంబర్లను) రష్యా ఏర్పాటు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. మరోవైపు లివివ్ నగరంపై జరిగిన క్షిపణి దాడిలో కనీసం ఏడుగురు, ఖర్కివ్‌పై గుళ్లమోతలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా:ఆయుధ కర్మాగారాలతో పాటు ప్రధానంగా రైలు మార్గాలు వంటి మౌలిక సదుపాయాల విధ్వంసంపై రష్యా సైన్యం గురిపెట్టింది. డాన్‌బాస్ ప్రాంతంపై దాడికి ముందు ఉక్రెయిన్ సైనిక బలగాల సామర్థ్యాన్ని తగ్గించడానికి పలుచోట్ల వైమానిక దాడులు నిర్వహించింది. ఒకరోజులోనే 20 వరకు సైనిక లక్ష్యాలపై క్షిపణులు దాడి చేశాయని రష్యా తెలిపింది. ప్రజల సురక్షిత తరలింపు మార్గాలనూ రష్యా అడ్డుకుంటుండడంతో ఈ పనికి వరసగా రెండోరోజూ ఆటంకం కలిగిందని ఉక్రెయిన్ తెలిపింది. లుహాన్స్క్‌లో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న నలుగురిని రష్యా దళాలు కాల్చి చంపాయని వెల్లడించింది. తూర్పు ఉక్రెయిన్‌ను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. లొంగిపోయే సమస్యే లేదనీ, వీలైతే దౌత్య మార్గాల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలనుకుంటున్నామని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహల్ చెప్పారు.
జపాన్, స్విట్జర్లాండ్ కఠిన ఆంక్షలు:రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి జపాన్, స్విట్జర్లాండ్ అంగీకరించాయి. ఉక్రెయిన్ పౌరులపై దాడులకు రష్యాను జవాబుదారీగా చేయాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద సోమవారం టోక్యోలో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు.