Russian Ambassador Attacked By Redpaint: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా 'విక్టరీ డే' పేరుతో రష్యా ఉత్సవాలు చేసుకుంటోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాకు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విక్టరీ డే పురస్కరించుకొని పొలండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆందోళనలు చేపట్టిన నిరసనకారులు.. రష్యా రాయబారి ముఖంపై ఎరుపు రంగు సిరాతో దాడి చేశారు. ఉక్రెయిన్‌లో మారణహోమానికి ప్రతీకగా రక్తం రంగులో ఉన్న ఎరుపు రంగు సిరాను పూసుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.
రష్యా జరుపుకొంటున్న విక్టరీ డే ఉత్సవాల్లో భాగంగా పొలండ్‌లో రష్యా రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్ అమరవీరులకు నివాళులు అర్పించేందుకుగాను వారి సమాధుల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఉక్రెయిన్ మద్దతుదారులు సెర్గీ ఆండ్రీవ్‌ను చుట్టుముట్టారు. అంతేకాకుండా వారి చేతుల్లో ఎర్ర సిరాను ఆయన ముఖంపై చల్లడంతోపాటు నియంత, హంతకుడంటూ నినాదాలు చేశారు.