తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆయుధాలు ఆపకపోతే మూడో ప్రపంచయుద్ధమే!

Ukraine Crisis: ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ఆపకపోతే మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది రష్యా. కీవ్‌ ప్రభుత్వ కార్యాలయాలపైనా దాడి చేస్తామని తెలిపింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ భేటీ అయ్యారు. యుద్ధం విరమించాలని పుతిన్​కు హితవు పలికారు.

ukraine crisis latest news
ukraine crisis latest news

By

Published : Apr 27, 2022, 7:37 AM IST

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత భీకర రూపం సంతరించుకుంటోంది. నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై చిర్రెత్తిపోతున్న పుతిన్‌ సర్కారు- మూడో ప్రపంచ యుద్ధం మాట వినిపించింది. ఉక్రెయిన్‌ వైఖరి చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి, అణ్వాయుధాల ప్రయోగానికి దారి తీసే ముప్పు ఉందని తీవ్రంగా హెచ్చరించింది. పాశ్చాత్యదేశాలు, ఉక్రెయిన్‌ తమ వైఖరిని మార్చుకోకుంటే.. కీవ్‌లోని 'విధాన నిర్ణయ కేంద్రాల'పై క్షిపణులతో విరుచుపడతామని హెచ్చరిక సంకేతం పంపింది. తమ సేనలు క్రెమిన్నా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని ప్రకటించింది. రష్యా హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్న నాటో కూటమి దేశాల రక్షణ మంత్రులు ఉక్రెయిన్‌కు అదనపు సాయం చేస్తామని, పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని ప్రకటించారు. జర్మనీ మరో అడుగు ముందుకేసి.. విమాన విధ్వంసక ట్యాంకుల్ని ఇస్తామని హామీ ఇచ్చింది. పరిస్థితులు చేయిజారిపోతున్న తరుణంలో- ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మంగళవారం మాస్కోలో అడుగుపెట్టారు. అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌లతో మాట్లాడారు. యుద్ధ విరమణకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా- వివిధ నగరాలు, ప్రధానంగా రైల్వే వ్యవస్థలు, ఆయుధాగారాలపై రష్యా సైనికులు విస్తృతంగా దాడులు కొనసాగించారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం మాల్దోవాలోని ట్రాన్స్‌నిస్త్రియాలో మంగళవారం ఉదయమూ పేలుళ్లు జరగడం గమనార్హం.

మమ్మల్ని కవ్విస్తున్నారు: సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశంగా ఉక్రెయిన్‌ ఉండాలనేది తమ ఆకాంక్ష అని కీవ్‌ పర్యటనలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ 'రష్యా టీవీ' ముఖాముఖిలో స్పందించారు. 'ఉక్రెయిన్‌ తన పోరాటాన్ని కొనసాగించాలని, రష్యాను ఓడించాలని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయి. అది ఒక భ్రమ. పాశ్చాత్య దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలపై మా గురి ఉంటుంది. ఈ గొడవలో నాటో భాగం పంచుకోవాలని కోరడం ద్వారా ఉక్రెయిన్‌ నేతలు రష్యాను కవ్విస్తున్నారు. నాటో ఈ విషయంలో అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవడం లేదని అందరూ ప్రవచిస్తున్నారు. కానీ ఆ ప్రమాదం తీవ్రంగా ఉందనేది వాస్తవం. దానిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు' అని చెప్పారు. దీనిని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తోసిపుచ్చారు. తమకు మద్దతునిస్తున్న దేశాలను చూసి, ఆశలు వదులుకుని చివరకు ప్రపంచయుద్ధ ముప్పు గురించి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఓటమి తప్పదని మాస్కో గ్రహించిందని చెప్పారు.
మౌలిక సదుపాయాలు, సరఫరా వ్యవస్థల్ని ధ్వంసం చేయడం లక్ష్యంగా పుతిన్‌ సేనలు దాడుల్ని కొనసాగించాయి. ఉక్రెయిన్‌ను వీడిపోవాలని ప్రయత్నిస్తున్నవారితో కిటకిటలాడుతున్న లివివ్‌పై క్షిపణులు విరుచుకుపడ్డాయి. 56 లక్ష్యాలను రష్యా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. మేరియుపొల్‌లో మరో భారీ సమాధి బయటపడింది. ఇక్కడ చాలా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు భావిస్తున్నారు. తూర్పు ప్రాంతంలోనే కాకుండా ఉక్రెయిన్‌లో పలు ఇతర చోట్ల కూడా పుతిన్‌ సైన్యం దాడులు నిర్వహించింది.

మాల్దోవాపై భారీ దాడులు:ఉక్రెయిన్‌ సరిహద్దుకు 12 కి.మీ. దూరంలో ఉండే మాల్దోవాపైనా రాకెట్లు, గ్రెనేడ్లతో పెద్దఎత్తున దాడులు చోటు చేసుకున్నాయి. రెండుచోట్ల శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. దీనికి తామే పాల్పడినట్లు ఎవరూ ప్రకటించుకోలేదు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని రష్యా తెలిపింది.

రష్యా యుద్ధంలో పాల్గొనేందుకు వెళుతూ భావోద్వేగానికి గురైన ఉక్రెయిన్ సైనికుడు

మమ్మల్ని ఆపలేరు:ఉక్రెయిన్‌ రాజధానిలోని ‘విధాన నిర్ణయ కేంద్రాల’పై దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది. పాశ్చాత్య దేశాల సలహాదారులు తమను నిలువరించలేరని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాశ్చాత్య దేశాల ఆయుధాలను వాడేందుకు ఉక్రెయిన్‌ను ప్రోత్సహించేలా బ్రిటన్‌ ప్రకటనలు చేస్తోందని, అదే జరిగితే కీవ్‌లో ప్రభుత్వ భవనాలపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. కాగా లుహాన్స్క్‌ ప్రాంతంలోని క్రెమిన్నా నగరాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. స్లొవియాన్స్క్‌, క్రమటోర్స్క్‌ నగరాల వైపు ఈ సేనలు వెళ్తున్న క్రమంలో భారీ పోరాటం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు ట్వీట్‌ చేసింది. యుద్ధంలో ఇంతవరకు 15,000 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని బ్రిటన్‌ అంచనా.

"ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నాం. టర్కీలో జరిగిన చర్చల్లోనే ఒక పరిష్కారం లభించాల్సింది. అయితే తాత్కాలిక ఒప్పందాలపై ఉక్రెయిన్‌ వెనక్కి తగ్గింది. ఆ వైఖరి వల్లనే తదుపరి ఒప్పందంలో ప్రతిష్టంభన నెలకొంది. మేరియుపొల్‌లోని ఉక్కు కర్మాగారం నుంచి పౌరుల తరలింపునకు సురక్షిత నడవా ఏర్పాటుకు మేం ముందుకొచ్చాం. కానీ పౌరుల్ని ఉక్రెయిన్‌ సైన్యం రక్షణ కవచాలుగా వాడుకుంటోంది."

- గుటెరస్‌తో పుతిన్‌

70 మంది రష్యా సైనికుల మృతి!: ఖేర్సన్‌లో ప్రధానంగా రష్యా నియంత్రణలో ఉండే ఒక గ్రామంపై తమ సైనికులు చేసిన దాడిలో 70 మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ ప్రకటించారు.

విరమణకు మార్గం చూడండి:ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని వెంటనే విరమించాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. చర్చలకు, సాధ్యమైనంత త్వరగా యుద్ధ విరమణకు సానుకూల మార్గాలు కనిపెట్టడంపై తాము ఆసక్తితో ఉన్నట్లు చెప్పారు. అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు, ప్రాణాధార ఔషధాలు వంటివి ఉక్రెయిన్‌కు అందించి, మద్దతుగా నిలవబోతున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

ఎలాంటి సాయానికైనా సిద్ధమే:ఉక్రెయిన్‌ రక్షణావసరాలు తీర్చడానికి ఎలాంటి చర్య చేపట్టాలన్నా తాము సిద్ధమేనని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ప్రకటించారు. నాటో దేశాల అధికారులతో జర్మనీలోని అమెరికా వైమానిక స్థావరంలో ఆయన భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం కొనసాగేలా చూడడంపై సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు విమాన విధ్వంసక స్వయంచాలిత జెపార్డ్‌ తుపాకుల్ని అందజేయనున్నట్లు జర్మనీ ప్రకటించింది.

ఇదీ చదవండి:'చెర్నోబిల్'​లో అధిక రేడియేషన్.. రష్యా బలగాల వల్లే..

ABOUT THE AUTHOR

...view details