తెలంగాణ

telangana

ETV Bharat / international

50 వేల మందితో రష్యా సైనిక విన్యాసాలు.. అమెరికా ఆందోళన - రష్యా ఉక్రెయిన్ యుద్ధం వార్తలు

50 వేల మంది జవాన్లు, 140 యుద్ధవిమానాలు, 60 యుద్ధ నౌకలు సహా అయిదు వేలకు పైబడి ఆయుధ యూనిట్లతో సైనిక విన్యాసాలు చేపట్టింది రష్యా. ఉక్రెయిన్​తో యుద్ధం నేపథ్యంలో ఈ విన్యాసాలపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేసింది.

russia war games 2022
50 వేల మందితో రష్యా సైనిక విన్యాసాలు.. అమెరికా ఆందోళన

By

Published : Sep 2, 2022, 6:45 AM IST

Russia war games 2022 : భారీ ఎత్తున సైనిక విన్యాసాలను రష్యా గురువారం నుంచి ప్రారంభించింది. ఈ నెల ఏడో తేదీ వరకు వొస్టాక్‌ 2022 పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్‌, చైనా, లావోస్‌, మంగోలియా, నికరాగువా, సిరియాతోపాటు మరికొన్ని మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో వెల్లడించింది. వొస్టాక్‌లో పాల్గొనే భారత సైన్యం రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలను రష్యా సైన్యం విడుదల చేసింది. ఆ దేశంలోని గుర్తు తెలియని ప్రాంతంలో భారత సైనికుల కవాతు, వంటావార్పు, పాటలు పాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. 50 వేల మంది జవాన్లు, 140 యుద్ధవిమానాలు, 60 యుద్ధ నౌకలు సహా అయిదు వేలకు పైబడి ఆయుధ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని మాస్కో రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై కూర్రమైన యుద్ధం చేస్తున్న రష్యాతో కలిసి ఇతర దేశాలు పాల్గొనటంపై అమెరికా ఆందోళన చెందుతున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరెన్‌ జిన్‌ పిర్రె పేర్కొన్నారు.

రష్యా సైనిక విన్యాసాలు

ఉక్రెయిన్​లో మోగిన బడి గంటలు
మరోవైపు.. గత ఆరునెలలుగా యుద్ధ ఫిరంగులు మోగిన ఉక్రెయిన్‌ గడ్డపై తొలిసారి బడిగంటలు మోగాయి. గురువారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. సెప్టెంబర్‌ ఒకటిన తరగతి గదులకు చిన్నారులు హాజరుకావడం ఉక్రెయిన్‌ సహా మాజీ సోవియట్‌ దేశాల్లో ఓ సంప్రదాయం. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రాజధాని కీవ్‌ సమీపంలోని ఓ పాఠశాలకు వెళ్లి.. అక్కడ చిన్నారులతో కాసేపు గడిపారు. ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో స్కూళ్లు మూత పడ్డాయి. చదువులు ఆగిపోయాయి. అంతేకాదు. ఇప్పటివరకు రష్యా దాడిలో 379 మంది ఉక్రెయిన్‌ చిన్నారులు చనిపోయారు. 223 మంది ఆచూకీ దొరకలేదు. ఇంకో 7,013 మంది చిన్నారులను రష్యా బలవంతంగా తమ దేశానికి తరలించింది.

ఉక్రెయిన్​లో మోగిన బడి గంటలు

జపొరిజియాకు ఐఏఈఏ అధికారులు
ఉక్రెయిన్‌లోని జపొరిజియా అణువిద్యుత్కేంద్రానికి గురువారం అంతర్జాతీయ అణుఇంధన సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్‌ రఫెల్‌ గ్రాసీ నేతృత్వంలోని అధికారులు చేరుకున్నారు. ఐరోపాలోని అతి పెద్దదైన ఈ అణువిద్యుత్కేంద్రం రష్యా అధీనంలో ఉంది. గత కొన్ని రోజులుగా అటు ఉక్రెయిన్‌.. ఇటు రష్యన్‌ దళాలు ఈ కేంద్రంపై దాడులకు తెగబడుతున్నాయి. దీంతో కేవలం ఉక్రెయిన్‌కే కాదు.. మొత్తం ఐరోపాకే ముప్పు పొంచి ఉందన్న ఆందోళనను ఐరాస భద్రతామండలి వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో ఐఏఈఏ అధికారులు విద్యుత్కేంద్రం భద్రతను సమీక్షించనున్నారు.

రష్యాను నెగ్గనీయొద్దు: మెక్రాన్‌
ఉక్రెయిన్‌ యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనే రష్యాను నెగ్గకుండా చేయడం చాలా కీలకమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ అన్నారు. అయితే ఉక్రెయిన్‌ గెలవాలని, లేకుంటే రష్యాను చర్చలకు రప్పించే స్థాయిలోనైనా పోరాటం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఐరోపా, ఇతర దేశాలపై ఉందని ఫ్రెంచ్‌ రాయబారులతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details