Putin speech today : ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న లుహాన్స్క్, దొనెత్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునేందుకు ఈ నెల 23 నుంచి రిఫరెండం నిర్వహించనున్న వేళ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా సైన్యంలోకి అదనపు బలగాలను సమీకరించాలని ఆదేశించారు. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన పుతిన్ తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని తెలిపారు. పశ్చిమ దేశాలు న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. నాటో దేశాలకు చెందిన కొందరు నేతలు రష్యాపై అణ్వాయుధ ప్రయోగం కోసం మాట్లాడారని పుతిన్ అన్నారు. తమ వద్ద కూడా భారీ విధ్వంసం సృష్టించే అణ్వాయుధాలు ఉన్నాయని వారికి గుర్తు చేశారు. తమ అణ్వాయుధాలు నాటో దేశాల వద్ద ఉన్న వాటి కంటే అధునాతనమైనవని తెలిపారు. రష్యా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఏర్పడితే.. తమ ప్రజలను రక్షించుకోవడానికి శత్రువులపై ఎలాంటి ఆయుధానైనా ప్రయోగించడానికి సిద్ధమన్నారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం డాన్‌బాస్‌కు విముక్తి కలిగించడమే తమ లక్ష్యమని పుతిన్ ప్రకటించారు. ఆ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఉక్రెయిన్‌లో చేరాలని కోరుకోవడం లేదన్నారు. పుతిన్ పాక్షిక సమీకరణకు పిలుపునివ్వడంతో రష్యాలో ఇది వరకు సైన్యంలో పని చేసిన దాదాపు 3 లక్షల మంది తిరిగి నిర్బంధ సైనిక శిక్షణ పొందుతారు. వీరి కూడా పోరాటానికి సిద్ధమవుతారు.
ప్రస్తుతం తన నియంత్రణలో ఉన్న తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలను విలీనం చేసుకునేందుకు రష్యా వడివడిగా అడుగులు వేస్తోంది. దొనెత్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను అంతర్భాగాలుగా చేసుకునేందుకు ఈ నెల 23 నుంచి 27 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ క్రమంగా బలపడుతూ రష్యా ఆక్రమిత ప్రాంతాలను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ నాలుగు ప్రాంతాలను చేర్చుకుని, సరిహద్దులను సవరించుకుంటే, ఇక వాటి జోలికి ఎవరూ రాలేరని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ కూడా వ్యాఖ్యానించారు. దొనెత్స్క్, లుహాన్స్క్‌తో కూడిన డాన్‌బాస్ ప్రాంతంలో 2014 నుంచే తిరుగుబాటుదారులు, ఉక్రెయిన్ సైన్యం మధ్య పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ పాలనలో సుదీర్ఘకాలంగా బాధలుపడుతున్న తాము.. త్వరలోనే మాతృదేశమైన రష్యాలో విలీనం కాబోతున్నామని, చారిత్రక న్యాయం దరిచేరబోతోందని తిరుగుబాటు నేత డెనిస్ పుషిలిన్ వ్యాఖ్యానించారు. రష్యాకు అనుకూలంగానే ఓటింగ్ జరుగుతుందని, పశ్చిమ దేశాలు మాత్రం ఈ ప్రక్రియను గుర్తించబోవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణతో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. రెఫరెండం తర్వాత ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయితే వాటి రక్షణ కోసం రష్యా ఎంతకైనా తెగించే అవకాశం ఉంటుంది.