తెలంగాణ

telangana

ETV Bharat / international

'పుతిన్‌ మెత్తబడ్డారు.. ఉక్రెయిన్​తో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధం!' - పుతిన్ చర్చలకు సిద్ధం

ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మెత్తబడ్డారని తుర్కీయే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యప్‌ ఎర్దొగాన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చలకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దీనిపై క్రెమ్లిన్ స్పందించింది.

RUSSIA PUTIN WAR
RUSSIA PUTIN WAR

By

Published : Oct 22, 2022, 6:51 AM IST

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే విషయంలో గతంతో పోలిస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మెత్తబడ్డారని, ప్రస్తుతం చర్చలకు సానుకూలంగా ఉన్నారని తుర్కీయే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యప్‌ ఎర్దొగాన్‌ తెలిపారు. "ఆశ లేకుండా అయితే లేం" అని ఆయన వ్యాఖ్యానించారు. అజర్‌బైజాన్‌ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన ఓ వార్తాపత్రికతో మాట్లాడుతూ చర్చలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై మాస్కో స్పందించింది. చర్చలకు పుతిన్‌ ఆరంభం నుంచి సిద్ధంగా ఉన్నారని, ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించకముందు కూడా చర్చల ప్రతిపాదన చేశారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ గుర్తు చేశారు. ఈ విషయంలో ఉక్రెయినే తమ విధానాన్ని మార్చుకుందని విమర్శించారు.

మరోవైపు కీవ్‌, ఇతర నగరాలను అల్లాడిస్తున్న ఆత్మాహుతి డ్రోన్లను సరఫరా చేసిన ఇరాన్‌పై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా తాజాగా మరోసారి మండిపడింది. ఈ డ్రోన్ల నిర్వహణలో రష్యన్లకు ఇరాన్‌ సైనిక సిబ్బంది శిక్షణ ఇస్తున్నారని పేర్కొంది. "క్రిమియాలో ఇరాన్‌ సిబ్బంది ఉన్నారని మేం అంచనా వేస్తున్నాం. ఇరాన్‌ నుంచి రష్యా చాలా డ్రోన్లను అందుకుంది. భవిష్యత్తులో కూడా ఈ సరఫరాలు కొనసాగనున్నాయి" అని అమెరికా ప్రతినిధి తెలిపారు.

ఉక్రెయిన్‌కు మరో 1800 కోట్ల యూరోలు: ఈయూ
ఉక్రెయిన్‌కు నిరంతర ఆర్థిక సాయం అందిస్తూనే ఉంటామని ఐరోపా సమాఖ్య (ఈయూ) తెలిపింది. 2023లో 1800 కోట్ల యూరోల మేర సాయం చేస్తామని పేర్కొంది. "కనీస అవసరాలకు నెలకు 3 నుంచి 4 వందల కోట్ల యూరోల అవసరమమని ఉక్రెయిన్‌ చెబుతోంది" అని ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు వాన్‌డెర్‌ లెయన్‌ తెలిపారు. నెలకు 150 కోట్ల యూరోలు తాము అందిస్తామని మిగతా మొత్తాన్ని అమెరికా, ఇతర ఆర్థికసంస్థల నుంచి సమీకరిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details