తెలంగాణ

telangana

ETV Bharat / international

నెలల తరబడి రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. సైన్యంలో ధిక్కార స్వరం!

Russia Ukraine war: నెలల తరబడి సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్‌ సైనిక బలగాలు తీవ్రంగా అలసిపోతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ధిక్కరిస్తున్నారు ఇరుదేశాల సైనికులు. మరోవైపు ఈ పోరుకు ముగింపు ఎప్పుడనేది ఎవరికీ తెలియదన్నారు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌.

Russia Ukraine war
Russia Ukraine war

By

Published : Jun 20, 2022, 9:20 AM IST

Russia Ukraine war: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలై 116 రోజులు దాటిపోయింది. నెలల తరబడి సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్‌ సైనిక బలగాలు తీవ్రంగా అలసిపోతున్నాయి. సైనికుల్లో స్థైర్యం దెబ్బతినడమే కాకుండా వారిలో నిరుత్సాహం ఆవరిస్తోంది. దీంతో తమ పైఅధికారులు ఇచ్చే ఆదేశాలను ధిక్కరించడానికి, వారిపై తిరగబడడానికి సైతం వెనుకాడడం లేదు. ఇరు దేశాల సైన్యంలోనూ ఈ పోకడ కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణ శాఖ అధికారులు గుర్తించారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై రెండు దేశాల సైనికులు పోరాటాన్ని ముమ్మరం చేయనున్నారని వారు అంచనా వేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకునేందుకు యూనిట్లు మొత్తం ధిక్కరించడం, అధికారులకు, దళాలకు మధ్య ఘర్షణ వంటివి కొనసాగనున్నాయని యుద్ధంపై రోజువారీ అంచనాలో బ్రిటన్‌ పేర్కొంది. తగిన సామగ్రి లేకపోవడం, సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల యుద్ధంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రష్యా సైనికులు ఫిర్యాదులు చేస్తున్న విషయాన్ని వారి ఫోన్‌ సంభాషణలపై నిఘా ద్వారా గుర్తించినట్లు ఉక్రెయిన్‌ నిఘా డైరెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లోని మైకొలైవ్‌ సహా వివిధ ప్రాంతాల్లో రష్యా సైనికుల దాడులు కొనసాగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ముగింపు ఎప్పుడో చెప్పలేం:దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేలా ఉందని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ అంచనా వేశారు. పోరుకు ముగింపు ఎప్పుడనేది ఎవరికీ తెలియదన్నారు. ఇది కొన్నేళ్లపాటు కొనసాగుతుందనుకుని సిద్ధపడాలన్నారు. ఇంధన, ఆహార ధరలకు కళ్లెం వేయడానికి వీలుగా ఉక్రెయిన్‌కు సాయం అందించాలని సభ్య దేశాలను కోరారు. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న రీతిలోనే ఉక్రెయిన్‌ విషయంలో రష్యా చేస్తే తాము మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. సీవెరోదొనెట్స్క్‌లోని మెటోల్కీన్‌ ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం మైకొలైవ్‌, ఒడెసా ప్రాంతాల్లోని దళాలను, ఆసుపత్రుల్ని సందర్శించారు. మైకొలైవ్‌ నుంచి ఆయన వెళ్లిన కాసేపట్లోనే రష్యా రాకెట్లు, క్షిపణులు ఆ ప్రాంతంలో విరుచుకుపడ్డాయి. హొవిట్జర్లు, సాయుధ శకటాలను ఉంచిన ఒక కర్మాగారాన్ని అవి ధ్వంసం చేశాయి. యుద్ధంలో రష్యా నెగ్గితే అదొక విపత్తు అవుతుందని, అలా జరగకుండా ఉక్రెయిన్‌కు సాయం అందించాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:వైట్​హౌజ్​ సమీపంలో కాల్పులు.. పలువురికి తూటా గాయాలు

ABOUT THE AUTHOR

...view details