Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కైవసం చేసుకునేందుకు పుతిన్ సేనలు నెల రోజులుగా చెమటోడ్చుతున్నా, ఇంతవరకూ ముందడుగు పడలేదు. రష్యా దాడులను ఉక్రెయిన్ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటూనే... దెబ్బతినే స్థితి నుంచి దెబ్బకొట్టే స్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట సరిహద్దులకు ఆవల రష్యా భూభాగంలోని భారీ ఇంధన నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసిన జెలెన్ స్కీ సేనలు.. తాజాగా ఆ దేశ యుద్ధనౌకను మట్టుబెట్టడంపై యుద్ధ నిపుణులను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిలకడగా పోరాడుతున్న ఉక్రెయిన్...తన శత్రువుపై క్రమంగా పైచేయి సాధిస్తోందని విశ్లేషిస్తున్నారు.
భీకర దాడులను నిలువరించేందుకే:ఒడెసా... ఉక్రెయిన్‌కు అత్యంత వ్యూహాత్మక ఓడరేవు. రష్యా తన అడ్మిరల్ ఎస్సెన్, అడ్మిరల్ మకరోవ్ యుద్ధనౌకలతో పాటు రెండు జలాంతర్గాములను కూడా ఇక్కడ మోహరించింది. ఎస్సెన్‌ను ఉపయోగించి పుతిన్ సేనలు 50 క్షిపణులను ఒడెసా నగరంపైకి ప్రయోగించాయి. భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ఇక్కడున్న మాస్కో నౌకలను మట్టుబెట్టడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
2014 లోనే ఆరంభం..ఉక్రెయిన్ దక్షిణ తీరానికి రక్షణ అంతంత మాత్రంగానే ఉంది. రష్యా ఆ ప్రాంతంలో తన నౌకాదళ కార్యకలాపాలను ముమ్మరం చేయడం వల్ల జెలెన్‌స్కీ సర్కారు ఆలోచనలో పడింది. రాజధాని కీవ్‌లోని ఇంజినీరింగ్ బ్యూరో 'లంచ్' ఆధ్వర్యాన 2014లో... యుద్ధనౌకలను మట్టుబెట్టే క్షిపణి వ్యవస్థల తయారీని ప్రారంభించింది. సోవియట్ రష్యా కేహెచ్35 క్రూయిజ్ మిసైల్‌ను పోలిన 'ఆర్‌కె-360 ఎంసీ నెప్ట్యూన్ క్రూయిజ్ మిసైల్' వ్యవస్థలను తయారుచేసింది.