ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా సైనికుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. యుద్ధ నిబంధనలను ఉల్లంఘించి ఉక్రెయిన్ పౌరులపై అకృత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చివరికి చిన్నారులను కూడా వదల్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని అనాథ శరణాలయాల నుంచి పిల్లల్ని ఎత్తుకెళ్లి వారిని రష్యాకు తరలించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. మాస్కో తరఫున పోరాడేందుకు ఉక్రెయిన్ చిన్నారులను అపహరించినట్లు తెలిసింది.
పుతిన్ సేనల అరాచకాలు.. అనాథ పిల్లల కిడ్నాప్.. రష్యాకు తీసుకెళ్లి... - అనాథలను కిడ్నాప్ రష్యా ఉక్రెయిన్
వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా... యుద్ధ నిబంధనలను ఉల్లంఘించమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోర్టు సిటీ ఖేర్సన్‌లోని అనాథ పిల్లలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి సైన్యంలో చేర్చుకోనున్నట్లు సమాచారం.
ఖేర్సన్ ప్రాంతం నుంచి వెనక్కివెళ్లిపోయిన సమయంలో రష్యా దళాలు 97మంది అనాథ పిల్లలను కిడ్నాప్ చేశాయని ఉక్రెయిన్ ఆరోపించింది. చిన్నారులను అపహరించటం యుద్ధ నిబంధనల్లో తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. 2014లో డాన్‌బాస్ ప్రాంతంలో అంతర్యుద్ధం జరిగినప్పుడు కూడా మాస్కో బలగాలు ఈ విధంగానే అనాథ చిన్నారులను ఎత్తుకెళ్లారు. మిలిటరీ స్కూళ్లలో చేర్చి, తమకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి, మాస్కో తరఫున పోరాడేలా తయారు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ఖేర్సన్‌లో చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
డాన్‌బాస్ ప్రాంతంలో 2014లో జరిగిన దారుణాలను తాము చూసినట్లు ఓ అనాథ ఆశ్రమం డైరెక్టర్ తెలిపారు. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా అన్ని ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్న ఆయన... అందుకే వారికి చిక్కకుండా పిల్లలను దాచిపెట్టినట్లు తెలిపారు. స్థానికులు కూడా సాయం చేసినట్లు చెప్పారు. ఓసారి రష్యా సీక్రెట్ పోలీసులు తమ ఆశ్రమంలోకి వచ్చారని, అప్పుడు వారికి పిల్లలెవరూ కన్పించకపోవడంతో ఆశ్రమంలోని సీసీటీవీ ఫుటేజ్, కంప్యూటర్ ఫైళ్లను తీసుకెళ్లారని తెలిపారు. మొత్తానికి వాళ్ల నుంచి తాము ఆ పిల్లలను కాపాడగలిగినట్లు అనాథ ఆశ్రమం డైరెక్టర్ తెలిపారు. స్టెపాన్వికా మినహా ఖేర్సన్‌లోని మిగతా ప్రాంతాల నుంచి ఎంతో మంది చిన్నారులను రష్యా సైన్యం తీసుకెళ్లినట్లు సమాచారం.