Russia Ukraine missile strikes: నల్లసముద్రంలోని స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మాస్కో సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ పోర్టు నగరం ఒడెసాలోని 9అంతస్తుల భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. తెల్లవారుజామున ఈ దాడి జరగ్గా.. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం పాక్షికం కుప్పకూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒడెసాలోని రిక్రియేషన్ సెంటర్‌పైనా రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి- 18 మంది బలి
Russian Ukraine missile attack: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ బలగాలతో పాటు సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. తాజాగా తీర ప్రాంత నగరం ఒడెసాలోని తొమ్మిది అంతస్తుల నివాస భవనంపై రష్యా క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 18మంది ప్రాణాలు కోల్పోగా 30మంది గాయపడినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. రష్యా దాడులను తప్పించుకునేందుకు భూగర్భ స్థావరాల్లో ఉక్రెయిన్ వాసులు తలదాచుకుంటున్నారు.
లుహాన్స్క్ నగరానికి నైరుతి వైపున 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిసిచాన్స్క్ చమురు శుద్ధి కర్మాగారంలో కొంత భాగాన్ని.. రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. జూన్ ద్వితీయార్థంలో ఉక్రెయిన్ వ్యాప్తంగా 68 జనావాసాలపై రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ బ్రిగెడియర్ జనరల్ పేర్కొన్నారు. గత రెండు వారాలతో పోలిస్తే రష్యా దాడులు రెండింతలు పెరిగినట్లు ఒలెక్సీ హ్రోమోవ్ ఆరోపించారు. అయితే పౌరులపై దాడి చేశామన్న ఉక్రెయిన్ అధికారుల ఆరోపణలను రష్యా ఖండించింది.
Russia Ukraine war news: లుహాన్స్క్ ప్రాంతంలోని సివియర్ డోనెట్స్క్ నగరం రష్యన్ బలగాల అధీనంలోకి వచ్చాక.. వారి దృష్టి దాని జంట నగరమైన లైసిచాన్స్క్ వైపు మళ్లింది. దీంతో మాస్కో సేనల నుంచి తప్పించుకునేందుకు లైసిచాన్స్క్‌లోని సుమారు 15వేల మంది పౌరులు భూగర్భ స్థావరాల్లో రక్షణ పొందుతున్నారు. ఉక్రెయిన్ బలగాల ఉపసంహరణతో లైసిచాన్స్క్ ప్రాంతం స్వాధీనమే లక్ష్యంగా మాస్కో దళాలు ముందుకు సాగుతున్నట్లు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం లుహాన్స్క్‌లోని 95శాతం భూభాగంతో పాటు, డొనెట్స్క్‌లో సగభాగం రష్యా అధీనంలోకి వెళ్లింది.