తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై రష్యా క్షిపణుల వర్షం.. ఇంధన కేంద్రాలే టార్గెట్.. నలుగురు మృతి

ఉక్రెయిన్‌పై వరుస క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడింది. పలు నగరాల్లోని ఇంధన కేంద్రాలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్‌లే లక్ష్యంగా పుతిన్‌ సేనలు క్షిపణుల వర్షం కురిపించాయి. మాస్కో బలగాల దాడుల్లో కనీసం నలుగురు మరణించగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. రష్యా దాడులను ఉక్రెయిన్‌ కూడా దీటుగా తిప్పికొడుతోంది. కీవ్‌లో రెండు క్రూయిజ్‌ క్షిపణులను అయిదు ఇరాన్‌ డ్రోన్‌లను పేల్చేసినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది.

RUSSIA UKRAINE WAR
RUSSIA UKRAINE WAR

By

Published : Nov 17, 2022, 4:54 PM IST

ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా విరుచుకుపడింది. వరుస క్షిపణి దాడులతో విధ్వంసం సృష్టించింది. పలు నగరాల్లోని మౌలిక సదుపాయల ధ్వంసమే లక్ష్యంగా పుతిన్‌ సేనలు భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం నలుగురు మరణించగా.. మరో అయిదుగురు దుర్మరణం పాలైనట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. భూమిపై యుద్ధంలో జెలెన్​స్కీ బలగాలు దీటుగా స్పందిస్తున్న నేపథ్యంలో రష్యా బలగాలు గగనతల దాడులను తీవ్రం చేశాయి. ఉక్రెయిన్‌లోని నగరాల్లో ఉన్న ఇంధన సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో సేనలు తీవ్ర దాడులతో విరుచుకుపడ్డాయి. గతంలో మాస్కో సేనలు చేసిన దాడుల కంటే ఈసారి దాడులు చాలా తీవ్రమైనవని... ఉక్రెయిన్‌కు భారీగా నష్టం కూడా వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేశారు.

అంధకారంలో ఉక్రెయిన్ నగరం

ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. వైమానిక దాడుల సైరన్‌లు ఉదయం నుంచి నిర్విరామంగా మోగుతూనే ఉన్నాయని డ్నిప్రో గవర్నర్ మాక్సిమ్ మార్చెంకో వెల్లడించారు. ఒడెసా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ ఆరోపించింది. పోల్టావా, ఖర్కివ్, ఖ్మెల్నిట్‌స్కీ రివ్నే ప్రాంతాల్లోనూ దాడులు జరగగా ప్రజలందరూ బాంబు నిరోధక షెల్టర్లలో ఉండాలని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కీవ్‌పైనా రష్యా వైమానిక దళం దాడులు చేసింది.

షెల్స్ సేకరిస్తున్న పోలీసులు

కాగా, రష్యా దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. రాజధాని కీవ్‌లో రెండు క్షిపణులు, అయిదు ఇరాన్‌ డ్రోన్‌లను పేల్చేసినట్లు గవర్నర్‌ ఒలెక్సీ కులేబా తెలిపారు. కీవ్‌లో వాయు రక్షణ వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు అందిస్తున్న వాయు రక్షణ వ్యవస్థలు ఉక్రెయిన్‌ సైనిక శక్తిని పెంచాయి. ఉక్రెయిన్‌ ఇంధన లక్ష్యాలపై రష్యా దాడులు పిరికిపందల చర్యగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ అభివర్ణించారు.

.

ABOUT THE AUTHOR

...view details