Russia Ukraine War: యుద్ధంలో పెద్దఎత్తున ప్రాణనష్టం కలిగించే ఆయుధాలను రష్యా ఇకపై ఉపయోగించబోతోందని ఉక్రెయిన్, బ్రిటన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో చొచ్చుకుపోయేందుకు ఈ ఆయుధాలకు పనిచెప్పనున్నట్లు వారు అనుమానిస్తున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగుతున్న యుద్ధం వల్ల సైనిక బలగాల సంఖ్య తగ్గిపోతుండడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా బ్రిటన్ రక్షణ శాఖ అభిప్రాయపడుతోంది. విమాన వాహక నౌకల్ని ధ్వంసం చేయడానికి రష్యా దాదాపు 60 ఏళ్ల క్రితమే అణ్వాయుధాలున్న కెహెచ్-22 క్షిపణుల్ని రూపొందించింది. వాటిని ఇప్పుడు వాడబోతుందనీ, ఆ క్షిపణుల్ని భూమ్మీదకు వేయడం వల్ల ఒక దిశానిర్దేశంలేని రీతిలో అవి వెళ్లి పెద్దఎత్తున ఆస్తి-ప్రాణనష్టాలు కలగజేస్తాయని బ్రిటన్ అంచనా. కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకునే అధునాతన క్షిపణులకు రష్యా వద్ద కొరత ఉండడంతో 5.5 టన్నుల సంప్రదాయ క్షిపణుల్నే వాడబోతోందని బ్రిటన్ తెలిపింది.
ఉక్రెయిన్‌ను అభినందించిన ఉర్సులా:రష్యాపై కొత్తగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌డెర్‌లెయెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కీవ్‌కు చేరుకున్న ఆమెతో ఆయన చర్చలు జరిపారు. ఈయూలో చేరాలన్న తమ ఉద్దేశం గురించి వివరించారు. అనంతరం ఇద్దరూ విలేకరులతో మాట్లాడారు. రష్యాను ఎదుర్కొని ఉక్రెయిన్ నిలిచిన తీరును ఉర్సులా అభినందిస్తూ, ఆ దేశాన్ని ఈయూలో చేర్చుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు.
అమ్మకానికి ఉక్రెయిన్ ఆహార ధాన్యాలు:ఉక్రెయిన్ ఆహారధాన్యాలను రష్యా దొంగిలిస్తోందన్న ఆరోపణల నడుమ దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజిజియా ప్రాంతంలో ఆహార ధాన్యాల కొనుగోలుకు రష్యా కొందరు అధికారుల్ని నియమించింది. ఆ పంట తమదేననీ, కొనుగోలుదారులెవరనేది పట్టించుకునేది లేదని తెలిపింది. మెలిటొపొల్ నగరాన్ని ఆక్రమించుకుంటున్న రష్యా బలగాలు అక్కడి ప్రజలకు తమ పాస్‌పోర్టుల్ని జారీ చేయడం ప్రారంభించాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంతవరకు 287 మంది పిల్లలు చనిపోగా, 492 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. తాజాగా 13 నగరాలు/ గ్రామాలపై క్షిపణులతో రష్యా దాడిచేసింది. ప్రత్యేక రైలులో పలువురు మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉక్రెయిన్‌ను వీడివెళ్లారు.