Russia Ukraine War:ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో రష్యా సేనలు వ్యూహాత్మంగా ముందడుగు వేస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇప్పటికే ఓడరేవు నగరాలపై దాడులు కొనసాగిస్తున్న మాస్కో సేనలు పరిశ్రమలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తమ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తున్న పుతిన్ సైన్యం తదుపరి లక్ష్యంగా రసాయన పరిశ్రమలను ఎంచుకుందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
Russia Ukraine latest news:రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ గెలుపునకు గుర్తుగా నిర్వహించిన విజయోత్సవాల్లో అధ్యక్షుడు పుతిన్ ప్రసంగం తర్వాత రష్యా సేనలు ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేశాయి. మరోసారి నాజీలపై పోరాటం చేస్తున్నామని, మన మాతృ భూమిని కాపాడుకునేందుకు యుద్ధం చేయాలని పుతిన్ ఇచ్చిన పిలుపుతో ఉక్రెయిన్‌లోని ఒడెసె నగరంపై మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి. పెద్ద ఎత్తున క్షిపణి దాడులతో ఒడెసెలో భవనాలు ధ్వంసమయ్యాయి. నల్ల సముద్రం పరిధిలో భారీ ఓడరేవు ఒడెసాలోనే ఉండగా అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఉక్రెయిన్ ఎగుమతి చేస్తోంది.
రష్యా జవాన్ల మృతదేహాల పక్కన ఉక్రెయిన్ అత్యవసర సేవల సిబ్బంది ఒడెసాపై రష్యా మొత్తం ఏడు క్షిపణులను ప్రయోగించగా.. ఓ షాపింగ్ సెంటర్, మరో డిపో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఐదుగురికి గాయాలయ్యాయని.. ఉక్రెయిన్ బలగాలు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ సోమవారం ఒడెసాలో పర్యటించిన సందర్భంగా రష్యా.. ఈ దాడులు చేసింది. ఫలితంగా ఉక్రెయిన్ ప్రధానమంత్రి డేనిస్‌తో సమావేశానికి ఆటంకం కలిగింది. చివరకు బాంబు షెల్టర్‌లో వీరు సమావేశమై ఎగుమతులపై చర్చించారు.
మరోవైపు, ఓడరేవు నగరం మరియుపోల్‌లోని కీలకమైన అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటు స్వాధీనం కోసం రష్యా సైన్యం పోరాటం కొనసాగిస్తోంది. వందలాది ఉక్రెయిన్ సైనికులు దాగి ఉన్నారనే అంచనాతో ప్లాంటులోని మౌలిక వసతులను ధ్వంసం చేస్తూనే ఉంది. లుహాన్‌స్క్, ఖార్కివ్, నిప్రో నగరాల్లోనూ రష్యా సేనలు యుద్ధ సైరన్లు మోగిస్తూ దాడులతో విరుచుకుపడ్డాయని.. అక్కడి అధికారులు తెలిపారు. సోమవారం 22 దాడులు చేసినట్లు లుహాన్‌స్క్ మేయర్ చెప్పారు. ఖార్కివ్ శివారు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.
44మృతదేహాలు గుర్తింపు:ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా జారవిడిచిన బాంబుల తాలూకు ప్రభావం తాజాగా కళ్లకు కట్టింది. ఆ భవన శిథిలాల కింద తాజాగా 44 మృతదేహాలు బయటపడ్డాయి. ఖర్కివ్‌లోని ఇజియం ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం రష్యా దాడులకు కూలిపోయింది. ఆ సమయంలో భవనంలో పౌరులు కూడా ఉన్నారు. మార్చి తొలి వారంలో ఈ ఘటన జరగ్గా.. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ భవన శిథిలాల కింద 44 మృతదేహాలను అధికారులు గుర్తించినట్లు ఖర్కివ్ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలే సినెహుబోవ్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఉక్రెయిన్ పౌరులపై రష్యా సేనలు పాల్పడిన మరో భయానక యుద్ధ నేరంగా దీన్ని పేర్కొన్నారు.
గత 11 వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం సాగిస్తోంది. తొలుత సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన క్రెమ్లిన్.. ఆ తర్వాత జనావాసాలపైనా విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని నగరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఖర్కివ్, మెరియుపోల్ భారీగా నష్టపోయాయి. ఇటీవల లుహాన్స్క్ ప్రాంతంలో ఓ పాఠశాల షెల్టర్ భవనంపై బాంబు దాడి చేయగా.. 60 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. అంతకుముందు మెరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా బాంబులు జారవిడిచింది. ఆ సమయంలో థియేటర్‌లో వెయ్యి మందికి పైగా ఉన్నారు. ఇందులో కనీసం 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: