Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చివరకు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. తనను, తన కుటుంబాన్ని బంధించేందుకు పుతిన్ సేనలు చాలా దగ్గరగా వచ్చాయంటూ యుద్ధం ప్రారంభ రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారాయన. టైమ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అలాగే అధ్యక్షుడిని రక్షించుకునేందుకు యుద్ధం మొదటి రోజు రాత్రి భవనంలో దీపాలన్నీ ఆర్పివేశామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
'యుద్ధం ప్రారంభమైన వెంటనే జరిగిన సంగతి నాకు స్పష్టంగా గుర్తుంది. నా భార్య, నేను పిల్లలిద్దరిని నిద్రలేపాం. మన దేశంపై బాంబులు వేయడం ప్రారంభించారని వారికి చెప్పాం. ఆ పేలుళ్లు బిగ్గరగా వినిపించాయి. రష్యన్ ప్రత్యేక బృందాలు కీవ్‌లో దిగాయని మాకు సమాచారం అందింది. వాటి లక్ష్యం నేను, నా కుటుంబం అని తెలిసింది. మమ్మల్ని చంపడమో, బంధించి తీసుకెళ్లడమో చేస్తారని ఆ సమాచారం సారాంశం. దాంతో అధ్యక్ష కార్యాలయాలు కూడా సురక్షితం కాదని మా అధికారులు భావించారు' అంటూ జెలెన్‌స్కీ వెల్లడించారు.
'అంతకుముందు వరకు అలాంటి దృశ్యాలను సినిమాల్లో మాత్రమే చూశాను. అధ్యక్ష భవనం వెనుక ద్వారానికి పోలీసు బారికేడ్లు, ప్లైవుడ్ బోర్డులతో అడ్డుకట్ట వేశాం. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు రాత్రి భవనంలో దీపాలన్నీ ఆర్పివేశాం. జెలెన్‌స్కీ, ఇతర సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రైఫిల్స్ అందుబాటులో ఉంచాం' అంటూ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆడ్రియ్ యెర్‌మాక్ తెలిపారు. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటిలిజెన్స్ సర్వీస్‌కు చెందిన మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. జెల్‌న్‌స్కీ భార్యాపిల్లలు అధ్యక్ష భవనంలో ఉన్న సమయంలోనే రష్యన్ సేనలు రెండు సార్లు దాడికి ప్రయత్నించాయని పేర్కొన్నారు.
టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా జెలెన్‌స్కీ..:ఫిబ్రవరి 24న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైంది. అప్పటినుంచి రష్యా సైనిక శక్తిని ఉక్రెయిన్ అడ్డుకుంటూనే ఉంది. వారంలో ముగుస్తుందనుకున్న యుద్ధం ఇప్పుడు రెండు నెలలు దాటిపోయింది. ఉక్రెయిన్‌కు సహకరించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చుతున్నాయి. దాంతో పుతిన్ సేనలకు ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జెలెన్‌స్కీ చూపుతోన్న తెగువ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంటోంది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచిక కవర్‌పేజీపై ఆయన చిత్రాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా రాసిన ప్రత్యేక కథనం.. అత్యంత క్లిష్ట సమయంలో ఆయన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారో వివరించింది.
ఇదీ చదవండి:'ముందుగా మేమే దాడి చేస్తాం'.. మరోసారి కిమ్ అణు బెదిరింపులు