Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులపర్వం కొనసాగుతోంది. మధ్య ఉక్రెయిన్ మిర్‌హోరోద్ ఎయిర్ బేస్‌లోని మందుగుండు సామగ్రి డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. పోల్తావా రీజియన్‌లోని స్థావరంపై జరిపిన ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన మిగ్ -29 యుద్ధవిమానం, ఎంఐ -8 హెలికాప్టర్‌నూ కూల్చినట్లు.... రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఖార్కివ్ నగరంపైనా దాడులు కొనసాగినట్లు ఆ ప్రాంత సైనిక పాలనాధికారి తెలిపారు. ఫిరంగులు, మోర్టార్‌లు, యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లతో దాదాపు 50వరకు దాడులు జరిపినట్లు చెప్పారు. రష్యా బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నప్రాంతాల్లో దారుణమైన యుద్ధనేరాలు బయటపడుతున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. కీవ్ రీజియన్‌లోని మకరీవ్ పట్టణంలో 132 మృతదేహాలు బయటపడగా వారిని క్రూరంగా హింసించి హత్య చేసినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పేర్కొంది.
Russia attack Ukraine: మరోవైపు క్రమాటెర్స్క్ రైల్వేస్టేషన్‌పై దాడి ఘటన తరహాలోనే నిరాయుధులపై మాస్కో దాడులు కొనసాగిస్తోందని బ్రిటన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు పేర్కొంది. రష్యా దళాలు క్షిపణులతో డాన్‌బాస్, మేరియుపొల్, మైకోలైవ్‌లపై దాడులు చేయటంపై దృష్టి సారించినట్లు చెప్పింది. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 176 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. లుహాన్స్క్ రీజియన్‌పై దాడులు పెరగడంతో...సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి గవర్నర్ ప్రజలకు సూచించారు. 10 మానవతా కారిడార్లు ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్ ఉప ప్రధాని తెలిపారు.