Russia Ukraine news: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి.. నాటో సభ్య దేశమైన పోలండ్‌లో పడిన ఘటన తీవ్రమైన అంశంగా మారింది. ఈ క్షిపణి రష్యాదేనా, కాదా అనే విషయంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ7, నాటో దేశాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
అసలేమైందంటే?
Russia attack Poland: మంగళవారం ఉక్రెయిన్‌పై అనేక క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జీ20 సదస్సులో ప్రసంగిస్తుండగా పదుల సంఖ్యలో క్షిపణులు ఉక్రెయిన్ను తాకాయి. ఈ క్రమంలోనే ఓ క్షిపణి పోలండ్ సరిహద్దులోని ఓ గ్రామంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇది రష్యా క్షిపణేనని వార్తలు వచ్చాయి. తొలుత అమెరికా రక్షణ వర్గాలు సైతం ఇది రష్యా పనేనని చెప్పాయి. ఒకవేళ నిజంగానే రష్యా ఈ క్షిపణి ప్రయోగించి ఉంటే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన మొదలైంది. పోలండ్‌కు నాటో సభ్యత్వం ఉంది కాబట్టి.. కూటమిలోని దేశాలన్నీ పోలండ్‌కు రక్షణగా నిలవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే యుద్ధం అనూహ్య మలుపు తిరిగేది.
రష్యాది కాకపోవచ్చు!
అయితే, పోలండ్‌లో పడిన క్షిపణి రష్యాది కాదని అమెరికా వివరణ ఇచ్చింది. జీ20 సదస్సులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం.. మిస్సైల్ రష్యా ప్రయోగించి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. 'ప్రాథమిక సమాచారం ఇందుకు(రష్యా ప్రయోగించిందనేందుకు) విరుద్ధంగా ఉంది. క్షిపణి గమనాన్ని చూస్తే ఇది రష్యా నుంచి ప్రయోగించినట్లు అనిపించడం లేదు. కానీ చూద్దాం. అసలేం జరిగిందో సరిగ్గా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. దర్యాప్తు తర్వాత ఏం చేయాలో సంయుక్తంగా నిర్ణయిస్తాం' అని బైడెన్ పేర్కొన్నారు. ఈ క్షిపణిని ఉక్రెయిన్ దళాలే ప్రయోగించి ఉండొచ్చని ప్రాథమిక అంచనాల్లో తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై రష్యా చేస్తున్న క్షిపణి దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దళాలు వీటిని ప్రయోగించి ఉండొచ్చని వివరణ ఇచ్చారు.