Russia Ukraine war latest news : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 200 రోజులు దాటిన నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రారంభంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ఉక్రెయిన్ జెండాలను ఎగురవేస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి రష్యా అధీనంలోని 6,000 చదరపు కిలోమీటర్ల కంటే అధిక భూభాగాన్ని తమ దళాలు హస్తగతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. 24 గంటల వ్యవధిలో దాదాపు 20కి పైగా స్థావరాలను రష్యా నుంచి చేజిక్కించుకున్నట్లు వెల్లడించారు.
అనేక మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి అదుపులోకి తీసుకున్నట్లు జెలెన్స్కీ సహాయకుడు తెలిపారు. ప్రస్తుతం యుద్ధ ఖైదీలను ఉంచేందుకు స్థలం కూడా లేదని, అంతమంది తమవద్ద బందీలుగా ఉన్నారని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో రష్యా సరిహద్దు వరకు ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లాయని ఖర్కివ్ గవర్నర్ ఓలేహ్ సైనీహుబోవ్ తెలిపారు. మరోవైపు, రష్యా సైనికులు పారిపోవడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. రష్యా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఖర్కివ్‌లోనే వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇది రష్యన్లకు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. కీవ్ నుంచి దళాలు ఉపసంహరించుకున్న తర్వాత యుద్ధంలో మాస్కోకు జరిగిన ఘోర అవమానం ఇదేనని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య మాస్కోలో నిర్వహించిన 875వ నగర ఆవిర్భావ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు.
అయితే, డాన్బాస్ ప్రాంతంలో తమ బలగాలను బలోపేతం చేసేందుకు సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ చెప్పుకొచ్చింది. పలు ప్రాంతాల నుంచి సైన్యం వెనక్కి మళ్లినట్లు చూపిస్తున్న ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. అయితే, రష్యా సైన్యం పారిపోయినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. రష్యా మీడియా సైతం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఉక్రెయిన్ దూకుడుకు నాటోనే కారణమంటూ పలువురు రష్యన్ విశ్లేషకులు చెబుతున్నారు. తమతో యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్ కాదని, నాటో అని రష్యా అనుకూల వార్తాపత్రిక ప్రతినిధి అలెగ్జాండర్ కోట్స్ తెలిపారు. పాశ్చాత్త దేశాలు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధంలో మెరుగ్గా పోరాడుతోందని అన్నారు.