Russia Ukraine News: దాదాపు నెలరోజులకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక ముందడుగు పడింది. రాజీ దిశగా ఇరు దేశాలూ ఓ ముందడుగు వేశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరుదేశాలూ మొగ్గుచూపాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఉత్తర ప్రాంత నగరం చెర్నిహైవ్ సమీపంలో తమ సైనిక కార్యకలాపాలు తగ్గించుకునేందుకు రష్యా సంసిద్ధత ప్రకటించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలుగా విశ్వాసాన్ని పెంచి, తదుపరి ముందడుగు వేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రష్యా రక్షణశాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫొమిన్ పేర్కొన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మంగళవారం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య మూడు గంటలపాటు కొనసాగిన చర్చలు చాలావరకు ఫలప్రదమయ్యాయి. ఈ నేపథ్యంలో కీవ్, చెర్నిహైవ్‌ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా సేనల ఉపసంహరణను గమనించినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అంతర్జాతీయ శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయమై ఉభయపక్షాలూ చర్చించుకున్నాయి. సేనల ఉపసంహరణతో పాటు ఉక్రెయిన్ భద్రతకు హామీ గురించి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. గతసారి చర్చల్లో కొలిక్కిరాని అంశాలపైనా ఉభయపక్షాలు మాట్లాడుకున్నాయి. రష్యా డిమాండ్‌కు తగ్గట్టుగా తమ దేశం (నాటోలో చేరకుండా) తటస్థంగా ఉంటుందని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ చర్చలకు ముందే వెల్లడించారు. డాన్‌బాస్ ప్రాంతంపైనా రాజీ పడతామని చెప్పారు. రాజీ దిశగా ఓ అడుగు ముందుకు వేశామని రష్యా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్స్కీ చెప్పారు. ఇరుపక్షాలూ ఒక్కో మెట్టు దిగిరావడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మాత్రం చాలా సమయం పడుతుందన్నారు. సంతకాలకు శాంతి ఒప్పందం సిద్ధమయ్యాక పుతిన్‌తో జెలెన్‌స్కీ భేటీ అయ్యేందుకు అంగీకరించామని తెలిపారు.
Russia Ukraine Talks:యుద్ధాన్ని ఆపాల్సిన ‘చరిత్రాత్మక బాధ్యత’ ఉభయ దేశాలపై ఉందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ పేర్కొన్నారు. శాంతి సాధనలో పరాజితులు అంటూ ఎవరూ ఉండరనేది తమ విశ్వాసమని, యుద్ధాన్ని కొనసాగించడం ఏ ఒక్కరికీ ఉపయోగపడదని చెప్పారు. చర్చలకు కూర్చున్న రెండు వర్గాలను ఉద్దేశించి ఆయన క్లుప్తంగా ప్రసంగించారు. రెండు పక్షాల మధ్య చర్చల్లో అర్థవంతమైన పురోగతి ఉందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుత్ చవోసోవ్లో చెప్పారు. ఈ చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల స్థాయిలో భేటీలు ఉంటాయనీ, అధ్యక్షుల మధ్య భేటీ జరగాలనేదీ ఎజెండాలో ఉందని తెలిపారు. శాంతి ఒప్పందం తీరుతెన్నులపై ఉక్రెయిన్ బృందం కసరత్తు చేస్తోంది. తాము తటస్థంగా ఉంటామనీ, తమ భద్రతకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ, చైనా, పోలండ్ వంటి ఇతర దేశాలు హామీ ఇవ్వాలని ఈ బృందం ప్రతిపాదిస్తోంది. ఒక్కరిపై దాడి చేస్తే అందరిపైనా చేసినట్లేనన్న నాటో సూత్రానికి అనుగుణంగా ఇది ఉండాలనేది ఉక్రెయిన్ భావన. క్రిమియా భవితవ్యంపైనా చర్చకు ఉక్రెయిన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. డాన్‌బాస్ విషయంలోనూ రాజీకి సిద్ధమని తెలిపింది. యుద్ధం నుంచి గౌరవప్రదంగా బయటపడడానికి ఇదో వ్యూహంగా భావిస్తున్నారు.
Russia Ukraine War:ఒకపక్క చర్చలు జరుగుతుండగా మరోపక్క ఉక్రెయిన్‌లో చమురు డిపోను, ప్రభుత్వ భవనాన్ని రష్యా సేనలు ధ్వంసం చేశాయి. చర్చల్ని రష్యా అధ్యక్షుడు తీవ్రంగా పరిగణనలో తీసుకుంటున్నట్లు లేదని బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ వ్యాఖ్యానించారు. కొన్ని వారాలుగా ముందడుగు వేయలేని స్థితిలో రష్యా ఉండడం, కీవ్ నగరాన్ని చుట్టుముట్టేటంత బలగాలు ఆ దేశం వద్ద అందుబాటులో లేకపోవడంతో సేనల ఉపసంహరణకు ఆ దేశం దిగి వచ్చినట్లుందని అమెరికాకు చెందిన సైనిక నిపుణుడు రాబ్‌లీ విశ్లేషించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించేవరకు తమ సైన్యం కార్యకలాపాలు ఉక్రెయిన్‌లో కొనసాగుతాయని రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గే షొయిగు స్పష్టంచేశారు.