తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆంక్షల దాడిని' రష్యా ఎలా ఎదుర్కొంటోంది?

Russia Ukraine Sanctions: ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అనేక ఆంక్షలను విధిస్తూ వస్తున్నాయి పాశ్చాత్య దేశాలు. అయితే ఆయా దేశాలు చెబుతున్న స్థాయిలో వాటి ప్రభావం రష్యాపై లేదని విశ్లేషకులు అంటున్నారు. ఆంక్షలను ముందుగానే ఊహించిన రష్యా.. చాన్నాళ్ల నుంచే వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ దేశ ప్రజల్లో అసంతృప్తి రాకుండా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నివారించేందుకు రష్యా ఏం చేస్తోందంటే?

Russia Ukraine Sanctions
russia ukraine news

By

Published : Apr 24, 2022, 7:16 AM IST

Russia Ukraine Sanctions: ఉక్రెయిన్‌ మీద యుద్ధానికి దిగిన రష్యాను శిక్షించేందుకు అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని దారికి తెచ్చుకోవాలనేది ఈ చర్యల ముఖ్యోద్దేశం. ఆంక్షల ప్రభావం రష్యాపై బాగా పనిచేస్తోందని పాశ్చాత్యదేశాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి అంత తీవ్రంగా లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రష్యాను దెబ్బతీయడం కన్నా.. పాశ్చాత్యదేశాలు తమ చర్యలతో తమను తాము నష్టం చేసుకుంటున్నాయనేది పుతిన్‌ వాదన. ఆ దేశాలు ఇలా స్పందిస్తాయని.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించడానికన్నా ముందే రష్యా ఊహించింది. తదనుగుణంగా చాన్నాళ్లనుంచే సన్నద్ధమవుతోంది. 'దుర్భేద్య రష్యా' పేరిట వ్యూహాన్ని సిద్ధం చేసింది.

.

అయినా గత రెండు నెలల్లో ఎదురైన 'ఆంక్షల దాడి', అనేక కంపెనీలు తమతో వ్యాపార సంబంధాలను తెంచేసుకోవడం క్రెమ్లిన్‌ను ఒకింత ఉక్కిరిబిక్కిరి చేశాయనేది విశ్లేషకుల అంచనా. ఆంక్షల తీవ్రత ఇంత ఎక్కువగా ఉంటుందని రష్యా పాలకులు ఊహించలేదంటున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు క్రెమ్లిన్‌ సర్వశక్తులొడ్డుతోంది. దేశ ప్రజల్లో అసంతృప్తి రాకుండా, వారి జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా చూసుకోవడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నివారించడం రష్యా ముందున్న పెను సవాళ్లు. వీటిని అధిగమించడానికి ఆ దేశం ఏం చేస్తోందో చూద్దాం.

చమురు ఆదాయం పడిపోకుండా..:ప్రపంచదేశాలకు చమురు, గ్యాస్‌ ఎగుమతులు చేయడం రష్యాకు అతిపెద్ద ఆదాయ వనరు. దీన్ని దెబ్బకొట్టడం కోసం- యుద్ధం మొదలుకాగానే ఈ వ్యాపారంపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ ఈ అస్త్రం అనుకున్నంత సమర్థంగా పనిచేయలేదనేది విశ్లేషకుల అంచనా. రష్యా చమురు, గ్యాస్‌ సరఫరాలపైనే ఆధారపడే ప్రపంచంలోని అనేక దేశాలు.. ఉన్నపళంగా రష్యా దిగుమతుల్ని ఆపేస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని ఆందోళన చెందాయి. అందుకే దొడ్డిదారిన రష్యా చమురును కొనడం కొనసాగిస్తున్నాయి. డాలర్లలో కాకుండా స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు చేస్తూ ఆంక్షల ప్రభావాన్ని తప్పించుకుంటున్నాయి. దీనివల్ల రష్యాకు ఎంతోకొంత ఆర్థిక ఉపశమనం లభిస్తోంది.

.

'లాడా' రీడిజైన్‌:లాడా అనేది రష్యాలో మంచి ప్రజాదరణ పొందిన కారు బ్రాండు. వీటిలో దిగుమతి చేసుకున్న విడిభాగాలే ఎక్కువ. లాడాను అవటోవాజ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇది ఫ్రాన్స్‌కు చెందిన రెనో సంస్థ యాజమాన్యంలో ఉంది. రెండు కంపెనీలూ ఉమ్మడిగా విడిభాగాలను సమకూర్చుకుంటున్నాయి. యుద్ధం నేపథ్యంలో రష్యా మార్కెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు రెనో మార్చి 24న ప్రకటించింది. దీంతో దిగుమతి చేసుకున్న విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు వీలుగా అనేక కారు మోడళ్లను రీడిజైన్‌ చేస్తామని అవటోవాజ్‌ వెల్లడించింది. ఏబీఎస్‌ వంటి అదనపు హంగులు ఉండబోవని తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వికాంటాక్ట్‌కు..:ఇటీవలి వరకు రష్యాలో అత్యధిక సామాజిక మాధ్యమ నెట్‌వర్క్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ఉండేది. ఫేస్‌బుక్‌కు ప్రతిగా తెచ్చిన 'వికాంటాక్ట్‌' రెండో స్థానంలో ఉండేది. గతనెలలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను రష్యా టెలికాం నియంత్రణ సంస్థ నిషేధించింది. ఆ సామాజిక వేదికల్లోని రష్యన్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వికాంటాక్ట్‌ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. మార్చిలో ఆ సంస్థ నెలవారీ వినియోగదారుల సంఖ్య 10 కోట్లకు చేరింది.

.

దేశీయ క్రెడిట్‌ కార్డులు:ఆర్థిక ఏకాకితనాన్ని ఎదుర్కోవడానికి చాలాకాలంగా రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఫలించాయి. ఆ దేశ జాతీయ చెల్లింపుల కార్డు వ్యవస్థ, దాని ఆధారంగా రూపొందిన 'మిర్‌' అనే బ్యాంకు కార్డుకు ఆదరణ పెరిగింది. 2016 చివర్లో 17.6 లక్షల కార్డులు ఉండేవి. గత ఏడాది అవి 11.3 కోట్లకు చేరాయి. 2021లో రష్యాలో కార్డుల ద్వారా జరిగిన చెల్లింపుల్లో నాలుగో వంతు 'మిర్‌'పైనే జరిగాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రయోజనాలు పొందేవారు ఈ కార్డును తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం స్పష్టంచేయడం ఇందుకు దోహదపడింది.

రష్యాలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని వీసా, మాస్టర్‌కార్డు సంస్థలు గత నెలలో ప్రకటించేనాటికి రష్యాలో ప్రత్యామ్నాయ వ్యవస్థ సిద్ధంగా ఉందన్నమాట. అయితే మిర్‌.. పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాలేదు. అతికొద్ది దేశాల్లోనే అది పనిచేస్తుంది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ 'స్విఫ్ట్‌'కు ప్రత్యామ్నాయంగా ఎస్‌పీఎఫ్‌ఎస్‌ అనే యంత్రాంగాన్ని నిర్మించుకోవాలన్న ప్రయత్నాలకూ ఇది అవరోధంగా మారింది.

.

ప్రజాపనుల్లో ఉద్యోగాలు..:ఆంక్షల వల్ల దెబ్బతిన్న వ్యాపారాల కారణంగా రష్యాలో ఇంకా భారీస్థాయిలో నిరుద్యోగం మొదలుకాలేదు. అలాంటి పరిణామం జరిగితే ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందని క్రెమ్లిన్‌ ఆందోళన చెందుతోంది. నిరుద్యోగుల్లో అసంతృప్తి రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతోంది. పాశ్చాత్య కంపెనీల నిష్క్రమణ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి శిక్షణ ఇప్పించి, తిరిగి ఉద్యోగాలు పొందేలా చూసేందుకు మాస్కోలో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని నగర మేయర్‌ సోబ్యానిన్‌ ప్రకటించడం ఇక్కడ గమనార్హం. ఉద్యోగులకు ఏదో ఒక పనిని అప్పజెప్పడమే ఇక్కడ సమస్యకు పరిష్కారమని ఆయన చెబుతున్నారు. పాస్‌పోర్టులు, జనన ధ్రువీకరణ పత్రాలు వంటి అధికార పత్రాల జారీ, నగర పార్కుల్లో పనులు కల్పించడం వంటి వాటిపై యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే యుద్ధానికి ముందు దిగ్గజ కంపెనీల్లో పనిచేసిన వారు ఇలాంటివాటికి సిద్ధపడకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వారిలో అనేకమంది దేశాన్ని వీడి వెళతారని చెబుతున్నారు.

కిం కర్తవ్యం?: ఆంక్షల తొలివిడత ప్రభావాన్ని రష్యా కొంతమేర తట్టుకుంది. తక్షణం వడ్డీ రేట్లను 20 శాతానికి పెంచడం ఇందుకు చాలావరకూ కారణమైంది. ఆ తర్వాత దాన్ని 17 శాతానికి తగ్గించింది. అలాగని రష్యాకు కష్టకాలం ముగిసిపోయినట్లు చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం మేర క్షీణిస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. రష్యా ఇంధన దిగుమతులపై ఐరోపా నిషేధం విధిస్తే ఈ క్షీణత మరింత పెరగొచ్చు. ద్రవ్యోల్బణం 17.5 శాతంగా ఉంది. రష్యా పౌరులకు ఇది ఇబ్బందికరంగా మారిందని పుతిన్‌ కూడా అంగీకరిస్తున్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం క్రెమ్లిన్‌కు కష్టం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

మేరియుపొల్‌లో మారణహోమం.. వెలుగులోకి సామూహిక సమాధులు

గుటెరస్ శాంతి యత్నం.. త్వరలో పుతిన్, జెలెన్​స్కీతో భేటీ

'భారత్​కు విలువ ఇస్తాం.. ఆ విషయంలో మాత్రం ప్రోత్సహించలేం'

ABOUT THE AUTHOR

...view details