తెలంగాణ

telangana

ETV Bharat / international

బంకర్‌లోకి పుతిన్‌.. అక్కడి నుంచే అన్ని పనులు!.. జెలెన్‌స్కీని చంపడమే రష్యా టార్గెట్​!! - drones attack on russia president

Russia Ukraine Drones War : రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పైకి రెండు డ్రోన్లు దూసుకురావటం వల్ల ఆ దేశం అప్రమత్తమైంది. అధ్యక్షుడు పుతిన్‌ను నోవో-ఒగరెవో ప్రాంతంలోని బంకర్‌లోకి తరలించింది. అధ్యక్ష కార్యాలయం, నివాసం ఉన్న కీలక భవనాలపై దాడికి ప్రయత్నం జరగడం వల్ల అమెరికాను తీవ్రంగా విమర్శించింది. దాడులకు పాత్రధారి ఉక్రెయినే అయినా సూత్రధారి మాత్రం అగ్రరాజ్యమే అంటూ తీవ్రారోపణలు చేసింది.

ukraine drones attack on russian president putin
క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి బంకర్​లోకి పుతిన్​

By

Published : May 5, 2023, 6:41 AM IST

Updated : May 5, 2023, 7:02 AM IST

Putin Bunker : రష్యా రాజధాని మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనాలపైకి రెండు డ్రోన్లు దూసుకురావడం తీవ్ర కలకలం సృష్టించడం వల్ల ఆ దేశం ఉలిక్కిపడింది. దీనికి కారణం అమెరికాయే అంటూ తీవ్రంగా విమర్శించింది. ఎక్కడ దాడి చేయాలో ఆ లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తే ఉక్రెయిన్‌ అమలు పరిచిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఆరోపించారు. ఆ రెండుదేశాల వ్యూహాలు తమకు తెలుసన్న విషయాన్ని అమెరికా గుర్తుంచుకోవాలన్నారు. వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉందని తెలిపారు. తమ దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయని.. ప్రస్తుతం దాడిపై తక్షణ విచారణ జరుగుతోందని పెస్కోవ్‌ హెచ్చరించారు.

క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపడం మినహా తమ దగ్గర మరో మార్గం లేదని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్‌ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ బేషరతుగా లొంగిపోయే పత్రంపై సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదని.. ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది అని మండిపడ్డారు.

Russia Ukraine Drones War : క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడం వల్ల మరింత అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పుతిన్‌ను బంకర్‌లోకి తరలించింది. నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఉన్న బంకర్‌ నుంచే పుతిన్ కార్యకలాపాలు నిర్వహిస్తారని రష్యన్‌ మీడియా వెల్లడించింది. మరో వైపు ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలపై కొద్దినెలల క్రితం పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తాజాగా ఈ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ సందర్శించడం వల్ల చర్చనీయాంశమైంది.

పుతిన్‌ న్యాయ విచారణను ఎదుర్కోవాల్సిందే: జెలెన్‌స్కీ
ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధానికి గానూ అంతర్జాతీయ యుద్ధ నేరాల న్యాయస్థానంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ న్యాయ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఆయనకు శిక్ష ఖాయమని చెప్పారు. నెదర్లాండ్స్‌లోని ఈ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ గురువారం సందర్శించారు. మరోపక్క- ఉక్రెయిన్‌లోని అడవుల్లో పలువురు ఉక్రెయిన్‌ సైనికులు గోప్యంగా శిక్షణ పొందుతున్నారు. 22-51 ఏళ్ల మధ్య వయసువారికి ఇది స్వల్పవ్యవధి సాంకేతిక శిక్షణ కార్యక్రమం.

దేశ భద్రతకు ముప్పే!
క్రెమ్లిన్‌పై చీకట్లో డ్రోన్ల సంచారంపై అనుమానాలు వీడడం లేదు. చివరిక్షణంలో వీటిని కూల్చేశామని అధికారులు ప్రకటించినా.. అది జరిగినట్లు చెబుతున్న 12 గంటల తర్వాత ప్రకటన రావడం, అప్పటివరకు వీడియో దృశ్యాలూ వెలుగు చూడకపోవడం, పేలుళ్లపై అన్నిగంటల వరకు సామాజిక మాధ్యమాల్లోనూ ఎలాంటి వార్తలు రాకపోవడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజంగా క్రెమ్లిన్‌ వరకు శత్రువుల డ్రోన్లు వచ్చాయంటే దేశ భద్రత ప్రశ్నార్థకమైనట్లేనని నిపుణులు అంటున్నారు. రష్యా దక్షిణ భాగంలోని క్రాస్నొడార్‌, రొస్తొవ్‌లలో రెండు చమురు క్షేత్రాలపై తాజాగా డ్రోన్లతో దాడులు జరిగాయి.

Last Updated : May 5, 2023, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details