తెలంగాణ

telangana

ETV Bharat / international

'రష్యా.. మేరియుపొల్‌పై కరాళ నృత్యం చేయాలనుకుంటోంది' - ఉక్రెయిన్​ రష్య్​

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో నేడు, రేపు కీలకం కానుంది. ఈ రెండు రోజులు రష్యా సేనలు మరింత విరుచుకుపడే ప్రమాదం ఉండడం వల్ల ఉక్రెయిన్‌ సైన్యం ఇంకా అప్రమత్తం అయ్యింది. మేరియుపోల్‌ నగరం స్వాధీనమే లక్ష్యంగా రష్యా సేనలు పోరాటం చేస్తుండగా, అక్కడ బలగాలను కట్టుదిట్టం చేసింది. అక్కడి ఉక్కు కర్మాగారం నుంచి మహిళలు, చిన్నారులు, వృద్ధులందరినీ తరలించినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. భయానక యుద్ధాల బాధితులను యావత్‌ ప్రపంచం గుర్తు చేసుకుంటుంటే రష్యా మాత్రం మేరియుపొల్‌పై కరాళ నృత్యం చేయాలనుకుంటోందని విమర్శించారు ఉక్రెయిన్‌ మంత్రి యెవ్‌హెన్‌ యెనిన్‌.

Ukraine's focus on retaining Russia
Ukraine's focus on retaining Russia

By

Published : May 8, 2022, 5:44 AM IST

Ukraine Crisis: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల మీద సాధించిన విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యాలో జరిగే విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అదేరోజు పుతిన్‌ సేనలు తమపై మరింతగా విరుచుకుపడే అవకాశం ఉండడంతో ఉక్రెయిన్‌ బలగాలు ఇంకా అప్రమత్తమయ్యాయి. మేరియుపొల్‌ నగరంపై రెండ్రోజులుగా దాడుల తీవ్రత పెరగడంతో అక్కడ బలగాలను కట్టుదిట్టం చేశాయి. గగనతల దాడులపై తాము వెలువరించే హెచ్చరికల్ని అనుసరించాలని ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. ఈ రెండ్రోజుల్లో రష్యా మరింత పేట్రేగిపోయే అవకాశం ఉందని ఉక్రెయిన్‌ మంత్రి యెవ్‌హెన్‌ యెనిన్‌ చెప్పారు. భయానక యుద్ధాల బాధితులను యావత్‌ ప్రపంచం గుర్తు చేసుకుంటుంటే రష్యా మాత్రం మేరియుపొల్‌పై కరాళ నృత్యం చేయాలనుకుంటోందని విమర్శించారు.

మంటల్లో పురావస్తుశాల..ఖర్కివ్‌ ప్రాంతంలోని ఉక్రెయిన్‌ జాతీయ పురావస్తుశాలపై రష్యా సైనికులు నిప్పులు కురిపించి ఆ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. ఖర్కివ్‌ సమీపంలోని రైల్వేస్టేషన్‌ వద్దకు అమెరికా, ఐరోపా దేశాల నుంచి భారీగా వచ్చిన సైనిక పరికరాలను, బఖ్‌ముత్‌లోని ఆయుధ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌కు చెందిన 13 డ్రోన్లను, మూడు బాలిస్టిక్‌ క్షిపణుల్ని కూల్చివేశామని తెలిపింది. మేరియుపొల్‌లోని మిగిలిన ప్రాంతాలపై రష్యా నియంత్రణ సాధించింది. ఒడెసాపై ఆరు క్రూయిజ్‌ క్షిపణుల్ని ప్రయోగించింది. ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు ప్రజలపై మానసికంగా ఒత్తిడి పెంచేందుకు శత్రువు ప్రయత్నిస్తున్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొంది. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణంలో ఇంకా ఉన్న దళాలను రక్షించే ప్రయత్నాల్లో శక్తిమంతమైన దేశాలు పాలు పంచుకుంటున్నాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.

.

భద్రతా మండలి ఆందోళన..ఐరాస: ఉక్రెయిన్‌లో శాంతి, భద్రతలకు సంబంధించిన పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తంచేసింది. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి. యుద్ధం, ఘర్షణ అనే పదాలను వాడకుండా.. ఐరాసలోని సభ్య దేశాలన్నీ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది.

.

అగ్రరాజ్యాన్ని తప్పుపట్టిన అల్‌ఖైదా..బాగ్దాద్‌: అమెరికా బలహీనత కారణంగా ఆ దేశ మిత్రపక్షమైన ఉక్రెయిన్‌ ఇప్పుడు రష్యా దురాక్రమణకు ఎరగా మారిపోయిందని అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరి ఒక వీడియోలో పేర్కొన్నాడు. ఉగ్రవాదుల కార్యకలాపాలను పర్యవేక్షించే ‘సైట్‌ నిఘా గ్రూపు’ ఈ వీడియోను విడుదల చేసింది. వీడియోలో జవహరి చుట్టూ పుస్తకాలు, తుపాకులు కనిపించాయి.

.

ఉక్కు కర్మాగారానికి తూట్లు..మేరియుపొల్‌లోని సువిశాల అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం ప్రాంగణం భారీగా విధ్వంసానికి గురైనట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని భవంతుల పైకప్పులకు పెద్దపెద్ద రంధ్రాలు పడినట్లు స్పష్టమవుతోంది. ఫిరంగులు, రాకెట్లు ఉపయోగించడమే కాకుండా నౌకల నుంచి కూడా అక్కడి లక్ష్యాలపై విరుచుకుపడడంతో పెను విధ్వంసం చోటు చేసుకున్నట్లు ధ్రువపడుతోంది. ఈ పరిస్థితుల మధ్యనే మరింతమందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు కొనసాగాయి. అధ్యక్షుడి ఆదేశానుసారం ఆ ప్రాంగణంలో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధుల తరలింపు పూర్తి చేశామని ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరీనా వెరెశ్చుక్‌ శనివారం ప్రకటించారు.

ఇదీ చదవండి:'రక్తపాతంతో ఎలాంటి పరిష్కారం ఉండదు'

ABOUT THE AUTHOR

...view details