Russia Ukraine Conflict: యుద్ధంలో ఎంతగా మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన మంగళవారం ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. పూర్తిగా ధ్వంసమైపోయిన మేరియుపొల్ నగరంలో శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులకు ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్లో దాదాపు 200 మృతదేహాలు కనిపించాయి. వాటిలో చాలావరకు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని, తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా చూడడానికి సంచార దహనవాటికలను తీసుకురావడంతో పాటు సామూహిక పూడ్చివేతలను రష్యా చేపడుతోందని ఆరోపించాయి. రష్యా సైనికులు డాన్‌బాస్ ప్రాంతంలో ముమ్మర దాడులు కొనసాగించారు. సీవియెరోదొనెట్స్క్, చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టి, దిగ్బంధం చేయడానికి బలగాలను మోహరించారు. స్విట్లోడార్స్క్ పట్టణాన్ని రష్యా సేనలు స్వాధీనపరచుకుని తమ దేశ జెండాను ఎగరేశాయి. వ్యూహాత్మకంగా కీలకమైన క్రమటోర్స్క్ ప్రాంతానికి ఇది 50 కి.మీ. దూరంలో ఉంటుంది.
ఉద్దేశపూర్వకంగానే తీవ్రత తగ్గింపు!:చిన్నచిన్న విజయాలను సాధిస్తున్నా, అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నామని రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులు చెప్పారు. తాము చుట్టుముట్టిన నగరాల నుంచి ప్రజలు సురక్షితంగా తరలేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగానే దాడి తీవ్రతను తగ్గించామని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు చెబుతున్నారు. తమపై సంపూర్ణ యుద్ధానికి దిగడం ద్వారా సాధ్యమైనంత విధ్వంసాన్ని సృష్టించేందుకు రష్యా చూస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. గత 77 ఏళ్లలో ఐరోపాలో ఎక్కడా ఇలాంటి యుద్ధం చోటు చేసుకోలేదన్నారు. డెస్నాలో గత వారం జరిగిన దాడిలో 87 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కేవలం నాలుగు క్షిపణులతో అక్కడ అపార నష్టాన్ని కలిగించారని తెలిపారు. యుద్ధానికి మంగళవారంతో మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్‌పైకి 1,474 సార్లు క్షిపణి దాడుల్ని రష్యా చేసిందని, వేర్వేరు రకాలకు చెందిన 2,275 క్షిపణుల్ని ఉపయోగించిందని వివరించారు. దాదాపు మూడువేల సార్లు గగనతల దాడులు జరిగాయని, ప్రధానంగా పౌరుల ఆవాసాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
నిత్యావసరాల కోసం క్యూ:వారాల తరబడి బాంబుల మోతతో దద్దరిల్లిన ఖర్కివ్‌లో దాడుల తీవ్రత తగ్గడంతో ప్రజలు నిత్యావసరాల కోసం పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. సహాయక కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న గోధుమపిండి, పాస్తా, చక్కెర తదితరాల కోసం వారు ఆరాటపడుతున్నారు. ప్రతిరోజూ పలువురు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి ఖర్కివ్‌కు తిరిగి వస్తున్నారు. ఖేర్సన్‌లో ఒక సైనిక స్థావరాన్ని రష్యా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించడానికి ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం)ను రష్యా చేపట్టేలా ఉందని ఉక్రెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు.