Russia To Buy rockets from north korea : ఉత్తర కొరియా నుంచి లక్షల సంఖ్యలో శతఘ్ని గుండ్లు, రాకెట్లను కొనుగోలు చేయడం కోసం రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖలోని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా విధించిన ఎగుమతి నియంత్రణలు, ఆంక్షల కారణంగా రష్యా సైన్యానికి సరఫరాలు తగ్గి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందుకే మాస్కో ఇప్పుడు ఉత్తర కొరియా వైపు మళ్లిందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఉత్తర కొరియా నుంచి అదనంగా సైనిక పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తొలుత న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ నుంచి చౌకగా లభించిన డ్రోన్లను రష్యా కొనుగోలు చేసింది. వీటిల్లో మోహాజిర్-6, షహీద్ సిరీస్ మానవ రహిత విమానాలు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్‌పై యుద్ధంలో వినియోగించాలని భావించింది. కానీ, వీటిల్లో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉండటంతో రష్యా ఇబ్బందులు పడుతోందని గత వారం శ్వేతసౌధం పేర్కొంది.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా కూడా రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా చర్యలు తీసుకొంటోంది. ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికాను తప్పుపట్టడం.. రష్యా ఆత్మరక్షణకు చేపట్టిన సైనిక చర్యను సమర్థిస్తున్నట్లు చెప్పడం.. పశ్చిమ దేశాల ఆధిపత్య విధానాలను ఖండించడం వంటివి చేపట్టింది. అంతేకాదు రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పునర్నిర్మాణానికి ఉత్తర కొరియా నుంచి సిబ్బందిని కూడా పంపనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబారి డాన్‌బాస్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాల దౌత్యవేత్తలతో భేటీ అయ్యారు.