తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా హైపర్​సోనిక్​ క్షిపణి ప్రయోగం.. అమెరికా యుద్ధ విమానాలే లక్ష్యం! - రష్యా ఉక్రెయిన్​ న్యూస్​

zircon hypersonic cruise: రష్యా తన ఆయుధ పాటవాన్ని మరోసారి ప్రదర్శించింది. ధ్వని వేగం కన్నా 9 రెట్లు వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్​ క్షిపణిని పరీక్షించింది. ఈ తరహా పరిజ్ఞానంలో తన ఆధిపత్యాన్ని మరోసారి రష్యా చాటింది. అగ్రరాజ్యానికి ఒనగూరిన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు రష్యా హైపర్‌సోనిక్‌ అస్త్రాలవైపు మొగ్గింది.

zircon hypersonic cruise
zircon hypersonic cruise

By

Published : May 29, 2022, 7:10 AM IST

zircon hypersonic cruise: ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో రష్యా తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. ధ్వని వేగం కన్నా 9 రెట్లు (గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని తాజాగా పరీక్షించింది. బాలిస్టిక్‌ తరగతికి చెందని క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా పరిజ్ఞానంలో తన ఆధిపత్యాన్ని మరోసారి రష్యా చాటింది.

zircon hypersonic cruise

ప్రయోగం ఎక్కడ?:బేరంట్స్‌ సముద్రంలో అడ్మిరల్‌ గోర్ష్‌ఖోవ్‌ యుద్ధనౌక నుంచి జిర్కాన్‌ను రష్యా ప్రయోగించింది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని వైట్‌ సీలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.

శత్రు రాడార్లకు టోకరా:జిర్కాన్‌ క్షిపణిని శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవని రష్యా సైనికాధికారులు చెబుతున్నారు. దీనికి ఆ అస్త్ర వేగం ఒక కారణమైతే.. అందులో ప్రత్యేకంగా అమర్చిన స్టెల్త్‌ పరిజ్ఞానం మరో కారణం.

  • ఈ క్షిపణిలో వాడిన అప్‌గ్రేడెడ్‌ ఇంధనంవల్లే అది మెరుపులా దూసుకెళ్లగలుగుతోంది. ఈ వేగం కారణంగా జిర్కాన్‌ ముందు భాగంలోని వాయుపీడనం.. క్షిపణి చుట్టూ ప్లాస్మా మేఘాన్ని ఏర్పరుస్తుంది. అది శత్రు రాడార్‌ నుంచి వచ్చే రేడియో తరంగాలను శోషించుకుంటుంది. ఫలితంగా ఆ క్షిపణి ప్రత్యర్థి నిఘా నేత్రానికి చిక్కదు.అందువల్ల దాన్ని మరో అస్త్రంతో నేలకూల్చడం కష్టమే.
  • అమెరికాకు చెందిన ‘ఏజిస్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్‌ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్‌ క్షిపణికి అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు.
    జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్​

ఇదీ జిర్కాన్‌ సత్తా..

  • సముద్రం, నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగలదు.
  • విమానవాహక నౌకలు, యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో మోహరించగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు.
  • కదిలే లక్ష్యాలను ఛేదించడంలో జిర్కాన్‌కు తిరుగులేదు. ఒక సమూహంలోని ఎంపిక చేసిన లక్ష్యాన్ని అది ధ్వంసం చేయగలదు.
  • దీన్ని 'అజేయ' అస్త్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభివర్ణించారు.
  • పరిధి: 1,000- 1,500 కిలోమీటర్లు
  • ఇంజిన్‌: స్క్రామ్‌జెట్‌

అమెరికా యుద్ధవిమానాలే లక్ష్యం
అమెరికా వద్ద అణుశక్తితో నడిచే 11 విమానవాహక నౌకలు ఉన్నాయి. పరిమాణం రీత్యానే కాక సాంకేతిక పరిజ్ఞానంపరంగానూ ఇవి శక్తిమంతమైనవి. పెద్ద సంఖ్యలో యుద్ధవిమానాలను మోసుకెళుతూ.. కదిలే వైమానిక స్థావరాల్లా ఇవి వ్యవహరిస్తున్నాయి. అమెరికా సైనిక సత్తాను ప్రపంచం నలుమూలలకు చేరవేయడంలో కీలకంగా మారాయి. వీటి వల్ల అగ్రరాజ్యానికి ఒనగూరిన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు రష్యా హైపర్‌సోనిక్‌ అస్త్రాలవైపు మొగ్గింది. ఈ పరిజ్ఞానం విషయంలో గణనీయ పురోగతి సాధించింది.

జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్​
  • జిర్కాన్‌ సాయంతో అమెరికా విమానవాహక నౌకలనూ కూల్చేయవచ్చని రష్యా అధికారులు చెబుతున్నారు. 100 మైళ్ల దూరంలోనే ఈ క్షిపణిని పసిగట్టినప్పటికీ స్పందించడానికి ఆ యుద్ధనౌకకు నిమిషం సమయమే ఉంటుందని పేర్కొన్నారు.
  • అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి ‘కింజాల్‌’ను మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించింది.

సార్మాత్‌ అనే ఖండాంతర బాలిస్టిక్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణిని కూడా రష్యా అభివృద్ధి చేసింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఈ అస్త్రాన్ని పెను ముప్పుగా అమెరికా, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్షిపణి సాయంతో 200 సెకన్లలోనే బ్రిటన్‌ను తుడిచిపెట్టేస్తామని రష్యా గతంలో హెచ్చరించింది.

ఇదీ చదవండి:'అన్నీ మర్చిపోయి ముందుకు సాగండి'.. మాజీ ప్రేయసిపై మస్క్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details