Russia Nuclear Weapons In Belarus : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటినప్పటికీ ఇప్పట్లో ముగిసే దాఖలాలు కనిపించడం లేదు. పుతిన్ సేనకు దీటుగా ఉక్రెయిన్ సైన్యం కూడా పోరాడుతోంది. ఇటీవలే ఎదురుదాడి తీవ్రం చేసి ఉక్రెయిన్.. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో మరో గ్రామం తిరిగి తమ చేతుల్లోకి వచ్చినట్లు తెలిపింది. అయితే తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. బెలారస్లో మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను మోహరించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించడం ఈ నెల చివరి నాటికి పూర్తవుతుందని పుతిన్ చెప్పారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా దేశ భూభాగానికి బెదిరింపులు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ చెప్పారు. అయితే బెలారస్ రష్యాకు కీలకమైన మిత్రదేశం.. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా పనిచేసింది.
Russia Nuclear Weapons : టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలు.. యుద్ధభూమిలో శత్రు దళాలను, వారి ఆయుధాలను నాశనం చేయడానికి వీటిని ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్‌లోని మొత్తం నగరాలను కూల్చివేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా సైనిక వర్గాల సమాచారం. తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన మిస్సైళ్లు, బాంబులు తరలించినట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ధ్రువీకరించారు. ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధికంగా శక్తిమంతమైనవని తెలిపారు.
జెలెన్‌స్కీ సొంతూరిపై దాడి..
Zelensky Place Attack : ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవీ రిహ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ ఐదంతస్తుల భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికిపైగా గాయపడ్డారు. దాడిలో దెబ్బతిన్న ఐదంతస్తుల భవనం మంటల్లో చిక్కుకొంది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చని క్రైవీ రిహ్ నగర మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనా రష్యాదాడులను కొనసాగించింది. ఆ నగరానికి రక్షణగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పలు క్షిపణులను కూల్చివేశాయని కీవ్ ప్రాంత మిలిటరీ రీజియన్ ప్రతినిధులు వెల్లడించారు. కీవ్ సహా పలు నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్ మోగుతూనే ఉంది. మరోవైపు.. ఖార్కీవ్‌పై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆ నగర మేయర్ వెల్లడించారు. ప్రధానంగా పౌర నివాసాలపై రష్యా డ్రోన్లు దాడులు చేసినట్లు తెలిపారు. కైవ్‌స్కీ జిల్లాలో ఓ కంపెనీ, సాల్టివిస్కీ జిల్లాలో ఓ గిడ్డంగి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.