తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​ అధ్యక్షుడి సొంతూరుపై రష్యా దాడి.. 10 మంది మృతి - రష్యాపై ఉక్రెయిన్ దూకుడు

Russia Missile On Ukraine : పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో రష్యాపై ఎదురుదాడికి దిగి ఆక్రమిత గ్రామాలను ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకుంటున్న వేళ కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్‌పై దాడి ఉద్ధృతం చేసిన రష్యా.. జెలెన్‌స్కీ సొంత పట్టణం క్రైవీ రిహ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. రష్యా దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికిపైగా గాయపడ్డారు. మాస్కో దాడులను ఖండించిన జెలెన్‌స్కీ.. సామాన్య ప్రజలు, వారు నివశించే భవనాలు, పట్టణాలపై రష్యా హంతకులు యుద్ధం ప్రకటించారని దుయ్యబట్టారు.

Russia Missile On Ukraine
Russia Missile On Ukraine

By

Published : Jun 13, 2023, 5:48 PM IST

Russia Missile On Ukraine : ఎదురుదాడికి దిగి రష్యా ఆక్రమించిన గ్రామాలను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వేళ మాస్కో దాడులు ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవీ రిహ్‌పై రష్యా సోమవారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ ఐదంతస్తుల భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికిపైగా గాయపడ్డారు. దాడిలో దెబ్బతిన్న ఐదంతస్తుల భవనం మంటల్లో చిక్కుకొంది.

శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చని క్రైవీ రిహ్‌ నగర మేయర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పైనా రష్యాదాడులను కొనసాగించింది. ఆ నగరానికి రక్షణగా ఉన్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పలు క్షిపణులను కూల్చివేశాయని కీవ్‌ ప్రాంత మిలిటరీ రీజియన్‌ ప్రతినిధులు వెల్లడించారు. కీవ్‌ సహా పలు నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్‌ మోగుతూనే ఉంది. మరోవైపు.. ఖార్కీవ్‌పై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆ నగర మేయర్‌ వెల్లడించారు. ప్రధానంగా పౌర నివాసాలపై రష్యా డ్రోన్లు దాడులు చేసినట్లు తెలిపారు. కైవ్‌స్కీ జిల్లాలో ఓ కంపెనీ, సాల్టివిస్కీ జిల్లాలో ఓ గిడ్డంగి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడి

క్రైవీ రిహ్‌పై రష్యా దాడులు చేయడాన్ని ఉక్రెయిన్‌అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. రష్యా హంతకులు.. సామాన్య ప్రజలు, వారు నివశించే భవనాలు, పట్టణాలపై యుద్ధం ప్రకటించారని అన్నారు. రష్యా దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు జెలెన్​స్కీ వెల్లడించారు. క్షిపణులను ప్రయోగించిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడి
ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడి

రష్యాపై ఉక్రెయిన్ దూకుడు..
Russia Ukraine War Update : రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో మరో గ్రామం తిరిగి తమ చేతుల్లోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సోమవారం తెలిపింది. ఆగ్నేయ ఉక్రెయిన్ గ్రామమైన స్టోరోజోవ్‌పై తమ దేశ జెండా రెపరెపలాడినట్లు ఉక్రెయిన్‌ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాలియార్ వెల్లడించారు. అంతకుముందు తూర్పు దొనెత్క్స్‌ ప్రాంతంలో వెలికా నోవోసిల్కే పట్టణానికి దక్షిణంగా కలిసి ఉన్న మరో మూడు చిన్న గ్రామాలు రష్యా నుంచి విముక్తి పొందాయని చెప్పారు. రష్యాకు చెందిన వాగ్నర్‌ కిరాయి ముఠా ఇటీవల ఆక్రమించిన బ్లహుడాని గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ఆపరేషన్‌లో 68వ సెపరేట్‌ హంటింగ్‌ బ్రిగేడ్‌.. గ్రామం నుంచి శత్రుసేనలను తరిమికొట్టిందని పేర్కొన్నారు.

తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్​లోని భవనం

ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న మూడు గ్రామాల నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్లాయో లేదో మాస్కో ధ్రువీకరించలేదు. కొంతమంది రష్యా సైనిక బ్లాగర్లు ఆ ప్రాంతాల్లో నియంత్రణ కోల్పోయినట్లు అంగీకరించారు. మరోవైపు దక్షిణ , తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలలో వెయ్యి కిలోమీటర్ల మేర తమ సైనికులు ఉన్నారని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌ భారీ స్థాయి ఎదురుదాడులను తిప్పికొడుతున్నామని పేర్కొంది. దొనెత్స్క్‌, జపోరిజియా ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ దాడులు విఫలమయ్యాయని నల్ల సముద్రంలో చేసిన బోట్ల దాడినీ సమర్థంగా తిప్పికొట్టామని రష్యా మంత్రిత్వశాఖ తెలిపింది. గ్యాస్‌ పైప్‌లైన్లను పేల్చివేసేందుకు పంపిన అన్ని స్పీడ్‌ బోట్లనూ పేల్చివేశామని చెప్పింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details