Russia Ukraine War: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. రష్యా చేస్తున్న యుద్ధం వారి ప్రణాళికలకు అనుగుణంగా సాగడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కు నాటో కూటమి సాయం కొనసాగించాలని అన్నారు.
russia ukraine news: మరోవైపు, నాటోలో చేరాలని ఫిన్లాండ్ ఇదివరకే నిర్ణయం తీసుకోగా.. ఈ విషయంపై చర్చించేందుకు కూటమి నేతలతో బెర్లిన్‌లో సమావేశం కానుంది. స్వీడన్ సైతం నాటోలో చేరనున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ.. నాటోలో చేరేందుకు మొగ్గు చూపింది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఈ రెండు దేశాలు.. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తమ దేశ రక్షణ కోసం నాటోను ఆశ్రయిస్తున్నాయి. ఇది రష్యాను తీవ్రంగా కలిచివేసే అవకాశం ఉంది. నాటో తూర్పువైపు విస్తరిస్తూ తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తోందన్న ఆరోపణలతోనే ఉక్రెయిన్‌పై దండెత్తారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు జరుగుతుండటం గమనార్హం. అయితే, నాటో మాత్రం తమది దురాక్రమణ కూటమి కాదని, రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కూటమేనని చెబుతోంది.