Russia Drills Ukraine: ఉక్రెయిన్‌పై సైనికచర్య జరుపుతున్న రష్యా.. మరోసారి మిత్రదేశాలు, మాజీ సోనియట్ దేశాలతో కలిసి ఇవాళ భారీఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించనుంది. ఈ నెల ఏడో తేదీ వరకు వస్టాక్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్, చైనా, లావోస్, మంగోలియా, నికరగ్వా, సిరియాతోపాటు మరికొన్ని మాజీ సోవియట్ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది.
వ్యూహాత్మక విన్యాసాల్లో 50వేల సైనికదళాలు, 5వేల కంటే ఎక్కువగా ఆయుధాలు, మిలిటరీ హార్డ్‌వేర్ ముఖ్యంగా 140యుద్ధవిమానాలు, 60 యుద్ధనౌకలు, గన్ బోట్లు, మద్దతు పడవలు పాల్గొంటాయి. సైనిక కమాండర్లలో నైపుణ్యాలు పెంచటానికి, సైనిక ప్రధాన కార్యాలయాలు ఆదేశాలు ఇవ్వటానికి, తూర్పు దిశతోపాటు తూర్పు సముద్ర ప్రాంతంలో దండయాత్రలను తిప్పికొట్టడం, తూర్పు ప్రాంతంలో మిలిటరీ రక్షణకు భరోసా, మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడటం, శాంతి పరిరక్షణ వంటి లక్ష్యాలను.. సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వస్టాక్ సైనిక విన్యాసాల్లో పాల్గొనే భారత సైన్యం రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలను రష్యా సైన్యం విడుదల చేసింది. రష్యాలోని గుర్తు తెలియని ప్రాంతంలో భారత సైనికుల కవాతు, జవాన్లు వంట చేయటం, వారు పాటలు పాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. రష్యాకు చెందిన ఇతర బలగాలతోపాటు వైమానిక దళాలు, దీర్ఘశ్రేణి బాంబర్లు, మిలిటరీ రవాణా విమానాల ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని మాస్కో రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా-చైనా నౌక దళాలు జపాన్ సముద్రంలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటాయని పేర్కొంది. సముద్ర సమాచార వ్యవస్థలు, సముద్ర ఆర్థిక వ్యవహారాలను కాపాడటంతోపాటు సముద్రతీర ప్రాంతాల్లో దళాలకు సాయం అందించటమే రష్యా-చైనా నౌకా విన్యాసాల లక్ష్యమని మాస్కో ప్రకటించింది.