Russia Attack On Ukraine :ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన భీకర దాడుల్లో 27మంది పౌరులు మరణించారు. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలన్నింటిపైనా శుక్రవారం భారీ స్థాయిలో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 27 మంది మరణించగా, మరో 144 మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద గగనతలదాడి అని ఉక్రెయిన్ వెల్లడించింది.
'ఈ రోజు రష్యా తన అమ్ములపొదిలోని ప్రతి అస్త్రాన్ని మాపై ప్రయోగించింది' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విట్టర్(ఎక్స్)లో తెలిపారు. గతేడాది నవంబరులో 96 క్షిపణులు, ఈ ఏడాది మార్చిలో 81 క్షిపణులు రష్యా ప్రయోగించిందని, ఆ తర్వాత ఆ స్థాయిలో మాస్కో దాడి చేయడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. 'శిథిలాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక సిబ్బంది, బాధిత కుటుంబాలు ప్రయత్నిస్తున్నాయి. దేశ ప్రజలకు ఇది మరో చీకటి రోజు' అని తెలిపింది.
దాడులతో రష్యా పంపుతున్న సందేశాన్ని ప్రపంచం అర్థం చేసుకోవాలని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రి కులేబా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపై చర్చలు జరుపుతున్న పార్లమెంట్లు, చర్చలకు రష్యా సానుకూలంగా ఉందని వార్తలు రాస్తున్న ప్రసార మాధ్యమాలు ఈ శబ్దాలను ఆలకించాలని అన్నారు. భారీగా ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయాలని మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు దిమిత్రి కులేబా.