ప్రపంచ మీడియా మొఘల్, 92 ఏళ్ల రూపర్ట్ మర్డాక్ ఐదోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు రూపర్ట్. నాలుగో భార్య జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్న సంవత్సరంలోపే మరో పెళ్లికి సిద్ధమైపోయారు. 66 ఏళ్ల లెస్లీ ఆన్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన రూపర్ట్.. ఇదే తన చివరి వివాహమని స్పష్టం చేశారు. వీరి ఎంగేజ్మెంట్ న్యూయార్క్‌లోని సెయింట్ పాట్రిక్‌లో జరిగింది. మరో మీడియా సంస్థ ప్రముఖడైన దివంగత చెస్టర్ స్మిత్ భార్య లెస్లీ ఆన్‌ను ఈ ఏడాది వేసవిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియా, బ్రిటన్, న్యూయార్క్‌లో వారి జీవితాన్ని గడపనున్నారు.
"నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత సంవత్సరం ఓ సమావేశంలో ఆమెను కలుసుకున్నాను. కొంచెం సేపు ఆమెతో మాట్లాడాను. ఆ తర్వాత రెండు వారాలకు ఆమెకు ఫోన్ చేశాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇదే నాకు చివరి వివాహం."
--రూపర్ట్ మర్డాక్, మీడియా సంస్థల అధినేత
"నేను 14 ఏళ్లు ఒంటరిగా బతికాను. 70 ఏళ్ల వయసుకు చేరుకోవడం అంటే దాదాపు చివరికి వచ్చినట్లే. మా ఇద్దరికీ ఇది దేవుడు ఇచ్చిన కానుక. మేమిద్దరం గత సెప్టెంబర్‌లో కలిశాం. మా నిర్ణయం పట్ల మా స్నేహితులు చాలా సంతోషంగా ఉన్నారు."