Robot Attacks Engineer :దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజినీర్‌పై రోబో దాడి చేసింది. కార్ల తయారీలో సహాయ పడేందుకు రూపొందించిన రోబో- ఇంజినీర్పైనే దాడి చేసింది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్టిన్లోని గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో రెండేళ్ల క్రితం జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
గిగా టెక్సాస్ కార్ల ఉత్పత్తి పరిశ్రమలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తున్నారు. అయితే, ఈ రోబోలో లోపం తలెత్తింది. దీంతో తనకు ప్రోగ్రామింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్పైనే దాడి చేసింది. పరిశ్రమలో ఉన్న మూడు రోబోలను ఆఫ్ చేస్తుండగా ఒకటి ఇంజినీర్పైనే దాడి చేసింది. ఇంజినీర్‌ను బలంగా పట్టుకుని, అతడి వీపు, చేతులపై దాడి చేసింది. రోబో నుంచి తప్పించుకున్న ఇంజినీర్ ప్రమాదవశాత్తు పక్కన ఉన్న అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన ఇంజినీర్‌ను తోటి ఉద్యోగులు గమనించి ఆస్పత్రికి తరలించారు.
తాజాగా విడుదలైన నివేదికతో ఈ విషయం బయటపడింది. దీని ప్రకారం గతేడాదిలో సగటున ప్రతి 21 మందిలో ఒకరు గాయపడినట్లు తేలింది. ఇది ఇతర పరిశ్రమల సగటు కన్నా చాలా ఎక్కువ అని నివేదిక పేర్కొంది. 2022లో కూడా పరిశ్రమలో భారీ పేలుడు జరిగిందని తెలిపింది. అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా సంస్థ నిరాకరించింది. సంస్థలో ఉద్యోగ భద్రతపై తరచూ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఉద్యోగులకు సరైన రక్షణ కల్పించకుండా నిర్మాణ, నిర్వహణ, ఆపరేషన్స్ రంగాల్లో పనులు చేయిస్తుంటారని టెస్లాపై అనేక ఆరోపణలు ఉన్నాయి.