Rishi Sunak Second Round: బ్రిటన్ ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరోసారి ముందంజలో నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం గురువారం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలిపారు.
రెండో రౌండ్లో సునాక్ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. వీరంతా వచ్చే వారం జరగబోయే తదుపరి రౌండ్లో పోటీ పడనున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి ఆటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్.. రెండో రౌండ్లో 27 ఓట్లు రావడం వల్ల పోటీ నుంచి నిష్క్రమించారు.
తొలి రౌండ్లోనూ.. అంతకుముందు మొదటి రౌండ్లోనూ సునాక్.. 88 ఓట్లతో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. విదేశాంగమంత్రి లిజ్ ట్రస్‌కు 50 ఓట్లు, మాజీ మంత్రి కెమీ బదెనోచ్‌కు 40 ఓట్లు, టామ్ టుగేన్‌ధాట్‌కు 37 ఓట్లు వచ్చాయి. భారత సంతతికి చెందిన ఆటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్ 32 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.