బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి.. రిషి సునాక్ ఏకగ్రీవ ఎన్నిక
18:38 October 24
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి.. రిషి సునాక్ ఏకగ్రీవ ఎన్నిక
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు ప్రధాని అయిన తొలి నాన్-వైట్ వ్యక్తిగా నిలిచారు. ఆ పదవి చేపట్టిన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. అమెరికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయునిగా 2008లో బరాక్ ఒబామా చరిత్ర సృష్టించగా.. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టనున్న రిషి సునక్ ఇటువంటి చరిత్రనే లిఖించారు. రిషి సునాక్ కంటే ముందు నుంచే అనేక మంది దక్షిణాసియా సంతతికి చెందిన వారు బ్రిటన్‌లో మేయర్లుగా మంత్రులుగా పదవులు చేపట్టారు. ప్రీతి పటేల్, సాజిద్ జావిద్, సాదిఖ్ ఖాన్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరూ బ్రిటన్ ప్రధాని పదవికి ఎన్నికకాలేదు. ఆ దేశంలోని మైనార్టీలకు బ్రిటన్ ప్రధాని పదవి దక్కడం ఇదే తొలిసారి. ఆ చరిత్రను రిషి సునాక్ తిరగరాశారు. బ్రిటన్ చరిత్రలో పిన్నవయస్కుడైన ప్రధానిగా కూడా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక ప్రస్తుత ప్రధాని లిజ్‌ట్రస్ రాజీనామా ప్రకటించడంతో అత్యంత వేగంగా నూతన ప్రధాని ఎంపికను కన్జర్వేటివ్ పార్టీ చేపట్టింది. రిషి సునాక్, బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని పదవికి పోటీపడ్డారు. కానీ ముందుగానే బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటివ్ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పార్టీ ఐక్యత కోసం కన్జర్వేటివ్ నాయకత్వానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇందులో భాగంగా తమకు పూర్తి మద్దతు ఉన్నట్లు బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2గంటలలోపే పోటీలో ఉన్న సభ్యులు వెల్లడించాల్సి ఉంది. రిషి సునాక్‌కు 150కిపైగా ఎంపీల మద్దతు లభించింది. మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్ వందమంది ఎంపీల మద్దతు కూడ గట్టలేక పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బ్రిటిష్ ప్రధానిగా సునాక్‌కు మార్గం సుగమమైంది.
ఇంతకు ముందు లిజ్‌ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడ్డ రుషీ సునాక్ ఎంపీల మద్దతు సాధించారు. కానీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన టోరీ సభ్యుల మనసు గెలవలేకపోయారు. ఐతే తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడంతో బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్ ట్రస్ వైదొలిగారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన రిషీ సునాక్ ఎంపిల మద్దతు కూడగట్టి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు.