Rishi Sunak Trailing : బ్రిటన్‌లో ప్రధాని ఎంపిక కోసం కన్జర్వేటివ్ పార్టీలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారం ముగిసేనాటికి విజేత ఎవరనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. లిజ్ ట్రస్ ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఆమెతో పోలిస్తే రిషి సునాక్ కొంత వెనుకంజలో ఉన్నారు. శుక్రవారంతో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ కూడా ముగియనుంది. పోటీలో ఉన్న ఇద్దరు అగ్రనేతలు ముమ్మర ప్రచారం చేసుకోగా.. బుధవారం వారిద్దరి మధ్య చివరి డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం తన రాజీనామాను క్వీన్ ఎలిజిబెత్-2కు సమర్పించకముందే ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
దాదాపు 2,00,000 మంది సభ్యులున్న టోరిలో ఆగస్టు నుంచి పోస్టల్, ఆన్‌లైన్ విధానంలో ఓటింగ్ జరుగుతోంది. ఆ ఓటింగ్ సెప్టెంబర్ 2న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీనిలో లిజ్‌ట్రస్ మంచి మెజార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విజేతలు బ్రిటన్ రాణి అనుమతితో ప్రధాని పదవి చేపట్టనున్నారు.
కొత్త ప్రధానికి బ్రిటన్‌లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి రష్యా యుద్ధం కూడా తోడుకావడంతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాను అధికారం చేపడితే పన్నులను గణనీయంగా తగ్గిస్తానని ఇప్పటికే ట్రస్ హామీ ఇచ్చారు. కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టేవారి పాలన ఆధారంగా కన్జర్వేటివ్ పార్టీ 2025లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వారి స్ఫూర్తివల్లే రాజకీయాల్లోకి:బ్రిటన్ ప్రధాని ఎన్నికకు హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. పోటీలో ఉన్న ఇద్దరు అగ్రనేతలు ముమ్మర ప్రచారం చేసుకోగా.. బుధవారం వారిద్దరి మధ్య చివరి డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తే కారణమన్న ఆయన.. తన ప్రయాణంలో ఎంతో మద్దతుగా నిలిచిన ఆయన సతీమణి అక్షతా మూర్తికి ధన్యవాదాలు తెలిపారు.