తెలంగాణ

telangana

ETV Bharat / international

రిషి సునాక్ దూకుడు​.. మూడో రౌండ్​లోనూ టాప్​.. పెరిగిన ఆధిక్యం - రిషి సునాక్

Rishi sunak news: బ్రిటన్‌ ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన మూడో రౌండులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టామ్​ తుగెన్​ధాట్​ తక్కువ ఓట్లతో ఈ రౌండ్​లో నిష్క్రమించారు.

rishi sunak news
rishi sunak news

By

Published : Jul 19, 2022, 8:49 AM IST

Rishi sunak news: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న మాజీ మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరింత ఆధిక్యం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల తాజాగా జరిగిన మూడో రౌండ్​ ఓటింగ్​లో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో ఆయన ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌ 82 ఓట్లతో రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ 71 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కెమి బడెనోచ్‌కు 58 ఓట్లు వచ్చాయి. తదుపరి విడత ఓటింగ్‌ మంగళవారం జరగనుంది. దానిలో మరింత వడపోత జరుగుతుంది. గురువారం నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. ఆ తర్వాత 1,60,000 మంది అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానిని ఎన్నుకుంటారు. విదేశాంగ శాఖ కమిటీ ఛైర్మన్​ టామ్​ తుగెన్‌ధాట్ 31 ఓట్లు సాధించి పోటీ నుంచి నిష్క్రమించారు.

అంతకుముందు గురువారం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలిపారు. రెండో రౌండ్​లో సునాక్​ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి ఆటార్నీ జనరల్‌ సుయెలా బ్రవెర్మన్‌.. రెండో రౌండ్​లో 27 ఓట్లు రావడం వల్ల పోటీ నుంచి నిష్క్రమించారు.

తొలి రౌండ్​లోనూ.. అంతకుముందు మొదటి రౌండ్​లోనూ సునాక్.. 88 ఓట్లతో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్‌ 67 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌కు 50 ఓట్లు, మాజీ మంత్రి కెమీ బదెనోచ్‌కు 40 ఓట్లు, టామ్‌ టుగేన్‌ధాట్‌కు 37 ఓట్లు వచ్చాయి. భారత సంతతికి చెందిన ఆటార్నీ జనరల్‌ సుయెలా బ్రవెర్మన్‌ 32 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.

సెప్టెంబరు 5న తుది ఎన్నిక.. బ్రిటన్‌ నూతన ప్రధానిని కన్జర్వేటివ్‌ పార్టీ ఈ ఏడాది సెప్టెంబరు 5న ఎన్నుకోనుంది. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా ఎన్నికైనవారే బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు. కన్జర్వేటివ్‌ హోం వెబ్‌సైట్‌ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వే- సునాక్‌ మూడో స్థానానికి పరిమితమవుతారని అంచనా వేసింది. పెన్నీ మోర్డాంట్‌ ప్రధాని పీఠం దక్కించుకుంటారని జోస్యం చెప్పింది. బదెనోచ్‌, సునాక్‌, బ్రవెర్మన్‌ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలుస్తారని తెలిపింది.

ఇవీ చదవండి:ఐరోపాలో హీట్​వేవ్ బీభత్సం.. వేల ఎకరాలు దగ్ధం.. వెయ్యి మంది మృతి!

పెళ్లి వేడుకలో విషాదం.. 100మందితో వెళ్తూ పడవ బోల్తా.. 19మంది మహిళలు మృతి

ABOUT THE AUTHOR

...view details