బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న పోరులో భారత మూలాలున్న రిషి సునాక్ దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన నాలుగో రౌండ్‌లోనూ రిషి సునాక్ అత్యధిక మెజారిటీ సాధించారు. రెండో స్థానంలో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, మూడో స్థానంలో విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కొనసాగుతున్నారు. తాజా రౌండ్ నుంచి కెమి బడెనోచ్ ఎలిమినేట్ కావడంతో ప్రధాని పోటీలో ముగ్గురే నిలిచారు. ఈ టాప్ త్రీలోనూ రిషి సునాక్ అగ్రస్థానంలో కొనసాగుతుండడం ప్రధాని పదవిపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తున్నాయి.
కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు గానూ మంగళవారం మరోదఫా వడపోత ఎన్నిక జరిగింది. ఇందులో రిషి సునాక్‌కు 118 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు 92 ఓట్లు రాగా, మూడోస్థానంలో ఉన్న లిజ్ ట్రస్ 86 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న కెమి బడెనోచ్‌కు కేవలం 59 ఓట్లు రావడంతో ప్రధాని పదవి పోటీ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది.