తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​లో రిషి శకం ఆరంభం.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరణ

బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రిషి సునాక్. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్​ అనుమతి తీసుకున్న అనంతరం ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు.

rishi sunak news
rishi sunak news

By

Published : Oct 25, 2022, 4:09 PM IST

Updated : Oct 25, 2022, 4:44 PM IST

బ్రిటన్​ ప్రధాన మంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్​.. బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్​-3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజుతో సమావేశమైన రిషి సునాక్​.. అనంతరం ప్రధానిగా తొలిప్రసంగం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, ఉక్రెయిన్​-రష్యా యుద్ధం మూలాన దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్​ను బయటపడేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం, సమగ్రత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానిగా రాజీనామా చేసిన లిజ్​ ట్రస్​ను అభినందించారు రిషి. ఆమె దేశ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ క్రమంలోనే చిన్న తప్పులు చేసినా, అవి ఉద్దేశపూర్వకంగా చేయలేదని భావిస్తున్నాని చెప్పారు.

బ్రిటన్​ రాజుతో రిషి సునాక్​
బ్రిటన్​ రాజుతో రిషి సునాక్​

అంతకుముందు 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయంలో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ తన చివరి కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆమె సునాక్‌ పాలన.. విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంచి రోజులు మందున్నాయని చెప్పారు. బ్రిటన్‌ ప్రధానిగా తనకు అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ట్రస్‌ తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బకింగ్‌హామ్ ప్యాలస్‌కు వెళ్లిన లిజ్ ట్రస్‌.. రాజు చార్లెస్‌-3కి రాజీనామా పత్రం సమర్పించారు.

రిషి సునాక్​ను ఆహ్వానిస్తున్న దృశ్యం

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక ప్రస్తుత ప్రధాని లిజ్‌ట్రస్‌ రాజీనామా ప్రకటించగా.. అత్యంత వేగంగా నూతన ప్రధాని ఎంపికను కన్జర్వేటివ్ పార్టీ చేపట్టింది. రిషి సునాక్, బోరిస్ జాన్సన్‌, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని పదవికి పోటీపడ్డారు. కానీ ముందుగానే బోరిస్ జాన్సన్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటివ్‌ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పార్టీ ఐక్యత కోసం కన్జర్వేటివ్ నాయకత్వానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్‌ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇందులో భాగంగా తమకు పూర్తి మద్దతు ఉన్నట్లు బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2గంటలలోపే పోటీలో ఉన్న సభ్యులు వెల్లడించాల్సి ఉంది. రిషి సునాక్‌కు 150కిపైగా ఎంపీల మద్దతు లభించింది. మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌ వందమంది ఎంపీల మద్దతు కూడ గట్టలేక పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బ్రిటిష్‌ ప్రధానిగా సునాక్‌కు మార్గం సుగమమైంది.

ఇంతకు ముందు లిజ్‌ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడ్డ రుషీ సునాక్‌ ఎంపీల మద్దతు సాధించారు. కానీ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన టోరీ సభ్యుల మనసు గెలవలేకపోయారు. ఐతే తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడంతో బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన రిషీ సునాక్‌ ఎంపిల మద్దతు కూడగట్టి బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు.

ఇంగ్లండ్‌లోని సౌథంప్టన్‌ నగరంలో జన్మించారు రిషి సునాక్. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. వీరి మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. రిషి తండ్రి యశ్వీర్.. కెన్యా నుంచి, రిషి తల్లి ఉష.. టాంజానియా నుంచి బ్రిటన్‌కు వచ్చారు. 2001 నుంచి 2004 మధ్య గోల్డ్‌మన్ సాక్స్‌లో విశ్లేషకుడిగా రిషి పనిచేశారు. రెండు హెడ్జ్ ఫండ్స్‌లలోనూ విధులు నిర్వర్తించారు.

అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఇటీవల విడుదల చేసిన ఒక సర్వే ప్రకారం బ్రిటన్‌లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునక్ కుటుంబం ఒకటి. రిషికి రాజకీయాలు కొంచెం కొత్తే. 2014 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిచ్‌మండ్ నుంచి పోటీచేసి ఆయన గెలిచారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఆ స్థానంలో ఆయన గెలిచారు. మొదట కేంద్ర సహాయక మంత్రిగా, ఆ తర్వాత ఛాన్సలర్‌గా పనిచేశారు. బ్రిటన్ క్యాబినెట్‌లో ఛాన్సలర్‌ అనేది రెండో ముఖ్యమైన మంత్రిత్వ శాఖ. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి రిషి కావడం విశేషం.

ఇవీ చదవండి:బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి.. రిషి సునాక్‌ ఏకగ్రీవ ఎన్నిక

హిందూ మూలాలను మరవని రిషి సునాక్​.. భగవద్గీతపైనే ప్రమాణం!

Last Updated : Oct 25, 2022, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details