Rishi Sunak Israel Visit :హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ విరుచుకుపడటాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సమర్థించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇజ్రాయెల్ తమ దేశాన్ని కాపాడుకోవడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఆయన.. ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా ప్రజలు సైతం హమాస్ బాధితులేనని తాము గుర్తిస్తున్నామని అన్నారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందేందుకు ఇజ్రాయెల్ సహకరించడాన్ని సునాక్ స్వాగతించారు. హమాస్‌తో పోరాటంలో ఇజ్రాయెల్ పక్షాన బ్రిటన్ ప్రజలు నిలబడతారని స్పష్టం చేశారు.
"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండటంపై చింతిస్తున్నా. అదే సమయంలో, ఓ స్నేహితుడిగా ఈ సమయంలో మీ వద్ద ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నా. గడిచిన రెండు వారాల్లో ఈ దేశం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఒక్కదేశమే కాదు, ఏ దేశ ప్రజలు వీటిని భరించకూడదు. బ్రిటిష్ ప్రజల తరఫున నేను ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నా. ఈ యుద్ధంలో మీకు అండగా ఉంటాం. ఇందులో మీరు గెలవాలని కోరుకుంటున్నాం."
-రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని
'ఈ పోరాటం ప్రపంచానిది'
హమాస్‌పై చేస్తున్న పోరాటం తామొక్కరిదే కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ పోరాటం నాగరిక ప్రపంచం మొత్తానిదని తెలిపారు. 'ప్రస్తుతం మేం అంధకారంతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ప్రపంచం మొత్తానికి అంధకారంతో కూడిన పరిస్థితులివి. ఈ సమయంలో మనమంతా కలిసికట్టుగా నిలబడి విజయం సాధించాలి' అని నెతన్యాహు అన్నారు.
బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించగా తాజాగా రిషి సునాక్ అక్కడికి వెళ్లడం విశేషం. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఆ దేశానికి వెళ్లే ముందు విడుదల చేసిన ప్రకటనలోనూ స్పష్టం చేశారు రిషి. ప్రతి పౌరుని మరణం విషాదమే అని.. హమాస్ ఉగ్రదాడుల తర్వాత అనేక మంది మృతి చెందారని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా గాజాలో మానవతా సాయం అందించటానికి మార్గం తెరవాలని.. అక్కడ చిక్కుకున్న బ్రిటన్ పౌరులు బయటపడటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్రిటన్ ప్రధాని సునాక్.. ఇజ్రాయెల్‌ను కోరినట్లు తెలుస్తోంది.