ఇటీవల బ్రిటన్ హోం సెక్రెటరీ పదవికి రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్‌ను తిరిగి అదే స్థానంలోకి తీసుకోవడంపై ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. మైగ్రేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆమెను.. తిరిగి పదవిలోకి ఎలా తీసుకుంటాని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వైవెట్టీ కూపర్ విమర్శించారు. దేశభద్రతకు బాధ్యత వహించే కీలక పదవిలో ఆమెను కూర్చోబెట్టడం సమంజసం కాదని, రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంలో భారీ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.
మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో హోం సెక్రటరీగా పని చేసిన బ్రేవర్మన్ మైగ్రేషన్‌కు సంబంధించిన అధికారిక పత్రాలను తన వ్యక్తిగత ఈమెయిల్ నుంచి సహచర ఎంపీలకు పంపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనికి బాధ్యత వహిస్తూ.. ఆమె పదవి నుంచి వైదొలిగారు. అయితే రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెను తిరిగి అదే స్థానంలోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
"బ్రేవర్మన్‌ను తిరిగి నియమించడం.. రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంలోని భారీ తప్పిదాన్ని కళ్లకు కడుతోంది. ఆయన అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఆమెను తిరిగి నియమించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశభద్రత కూడా ముఖ్యమని ప్రధాని గుర్తించాలి" అని కాపర్ మీడియాకు వెల్లడించారు. సునాక్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్‌ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీ (చీఫ్ విప్)గా సైమన్ హార్ట్‌ని నియమించారు. ఈ క్రమంలోనే బ్రేవర్మన్‌ను కూడా తిరిగి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆమె తన తప్పును తెలుసుకున్నారని ఈ సందర్భంగా రిషి వ్యాఖ్యానించారు. అలా నియమించడంపై ప్రస్తుతం విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇవీ చదవండి:కాటేసిన పాముపై రివేంజ్.. సర్పాన్ని కరిచిన బాలుడు.. పిల్లాడు సేఫ్.. పాము మృతి
జ్యోతిషుడు మాటలు నమ్మి.. ప్రియుడికి విషం ఇచ్చి చంపిన ప్రేయసి!