కోటీశ్వరుడైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తనకున్న ఎన్నో విలాసవంతమైన భవనాలను వదిలి.. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అంతకు ముందు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన అందులోనే నివసించారు. ఈ విషయాన్ని ఆ సెక్రటరీ ధ్రువీకరించారు. దీనికంటే 11 డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ విశాలంగా ఉంటుంది. కానీ రిషి మాత్రం 10లో ఉండాలనుకుంటున్నారు. ఎందుకు ఆయన దాన్నే ఎంచుకున్నారని అడగ్గా.. 'వారక్కడ అంతకుముందు సంతోషంగా ఉన్నారు' అని ప్రతినిధి సమాధానమిచ్చారు.
రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి.. దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె. ఆమె కూడా ఆ సంస్థలో వాటాదారు. దాంతో రిషి, అక్షత ఇద్దరి ఆస్తుల విలువ కలిపి 730 మిలియన్ల పౌండ్లుగా ఉంది. వారికి బ్రిటన్, విదేశాల్లో కలిపి నాలుగు ఇళ్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ 15 మిలియన్ల పౌండ్లు. అందులో న్యూయార్క్‌షైర్‌లో ఉన్న భవంతి విలువ 6.6 మిలియన్ల పౌండ్లు. ఇది నాలుగు అంతస్తుల్లో ఉంది.