అగ్రరాజ్యంలో రాజకీయ వేడిని రాజేసిన మధ్యంతర ఎన్నికలపై వెలువడుతున్న సర్వే ఫలితాలు డెమొక్రాట్లకు ఆశనిపాతంలా మారాయి. బైడెన్ రెండేళ్ల పాలనకు రిఫరెండంగా భావిస్తున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లకు షాక్ తగిలే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా చోట్ల రిపబ్లికన్ల జోరు కనిపిస్తోంది.
డెమొక్రాట్ల ఆధీనంలో ఉన్న చాలా సీట్లు రిపబ్లికన్లకు దక్కే అవకాశం ఉందని కూడా సర్వేలు తెలిపాయి. ఇదే జరిగితే ప్రతినిధుల సభ అధిపత్యం రిపబ్లికన్లకు దక్కి బైడెన్ కార్యవర్గ అజెండా అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాకపోతే ద్రవ్యోల్బణం కారణంగా ఎన్నికలకు ముందు డెమోక్రాట్లు భావించినంత ఘోరమైన ఫలితాలు మాత్రం రావని సర్వేలు చెప్పడం అధికారిక పార్టీకి కాస్త ఊరటనిస్తోంది. ఇక పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడ, అరిజోనాల్లో సెనెట్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.