తెలంగాణ

telangana

ETV Bharat / international

గొటబాయకు కొత్త ప్రధాని షాక్​.. రాజీనామా డిమాండ్​కు మద్దతు! - శ్రీలంక ఆర్థిక సంక్షోభం

Sri lanka protests president: సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రధానిగా నియమితులైన రణిల్​ విక్రమ్​ సింఘే.. అధ్యక్షుడు గొటబాయకు షాకిచ్చారు. అధ్యక్షుడు రాజీనామా చేయాలన్న నిరసనలకు మద్దతు పలికారు. మరోవైపు.. శ్రీలంకలో ఎల్​టీటీఈ దాడులు జరిపేందుకు కుట్ర చేస్తోందన్న భారత మీడియా కథనాలపై దర్యాప్తు చేపడతామని పేర్కొంది లంక ప్రభుత్వం.

Sri lanka protests president
గొటబాయ రాజపక్స, రణిల్​ విక్రమ్​ సింఘే

By

Published : May 15, 2022, 1:47 PM IST

Sri lanka protests president: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే ఝలక్​ ఇచ్చారు ఇటీవలే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్​ విక్రమ్​ సింఘే. గొటబాయ రాజీనామా చేయాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు పలికారు. 'గొట గో హోమ్'​ నిరసనకారుల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లోని యువ నిరసనకారులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చేందుకు 'గొట గో హోమ్'​ నిరసనలు కొనసాగాలి. అందుకు దేశంలోని యువత బాధ్యత తీసుకోవాలి. గ్రామాల్లో నిరసనలు చేస్తున్న యువతకు రక్షణ కల్పిస్తాం. భవిష్యత్తు విధాన రూపకల్పన కోసం వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం."

- రణిల్​ విక్రమ్​ సింఘే, శ్రీలంక ప్రధాని.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు ప్రజలు. ఏప్రిల్​ 9 నుంచి కొలంబోలోని గాలే ఫేస్​ గ్రీన్​లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 'గొట గో హోమ్'​ పేరుతో నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించి.. యునైటెడ్​ నేషనల్​ పార్టీ నేత రణిల్​ విక్రమ్​ సింఘే(73)ను 26వ ప్రధానిగా నియమించారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. అందుకు పార్లమెంట్​లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దేశంలో జరుగుతున్న నిరసనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు.

ఎల్​టీటీఈ కుట్రపై దర్యాప్తు: దేశ భద్రతను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది శ్రీలంక ప్రభుత్వం. మే 18న నిషేధిత ఎల్​టీటీఈ దాడులు జరిపేందుకు కుట్రలు రచిస్తోందన్న భారత మీడియా కథనాలపై దర్యాప్తు చేపడతామని పేర్కొంది. 2009లో శ్రీలంకలో తలెత్తిన అంతర్యుద్ధం ముగింపునకు గుర్తుగా మే 18న ముల్లివాయ్​కల్​ వార్షికోత్సం నిర్వహిస్తారు. 'మే 18న శ్రీలంకలో దాడులు చేసేందుకు ఎల్​టీటీఈ ప్రణాళికలు రచిస్తోందని భారత నిఘా విభాగం గుర్తించినట్లు ద హిందూ వార్తాపత్రికలో మే 13న కథనం ప్రచురించింది. ఈ విషయంపై ఆరా తీయగా.. సాధారణ సమాచారంగా అందించినట్లు భారత నిఘా విభాగం తెలిపింది. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని, శ్రీలంకకు సమాచారం తెలియజేస్తామని పేర్కొంది.' అని ఓ ప్రకటన విడుదల చేసింది లంక.

ఇదీ చూడండి:లంక సంక్షోభానికి తాత్కాలిక తెర.. నూతన ప్రధానిగా రణిల్​ విక్రమసింఘె

ABOUT THE AUTHOR

...view details