సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా? - sri lanka new president name 2022
12:46 July 20
శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నిక
Srilanka new president: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘె(73). బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్‌కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు. రణిల్‌కు ప్రధాన ప్రత్యర్థి, శ్రీలంకలో అధికార పక్షమైన పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) నేత దులస్ అలహాప్పెరుమాకు 82 మంది జైకొట్టారు. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనూర కుమార దిశనాయకేకు కేవలం మూడు ఓట్లు పడ్డాయి.
దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడం వల్ల కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికైన విక్రమసింఘె.. ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి.
శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు పనిచేసిన అనుభవం రణిల్ విక్రమసింఘె సొంతం. ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన కొద్దిరోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గొటబాయ పరారీ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు సభలో మెజార్టీ సభ్యుల మద్దతుతో పూర్తిస్థాయిలో అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. విదేశీ మారక నిల్వలు అడుగంటి, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతూ తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న దేశాన్ని ఎలాగైనా గట్టెక్కించడం ఆయన ముందున్న ప్రధాన సవాలు.
"దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనం చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది" అని అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు రణిల్.