తెలంగాణ

telangana

ETV Bharat / international

రాజాసింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్​ ఫైర్, మోదీకి స్పెషల్ డిమాండ్ - రాజాసింగ్ పాకిస్థాన్

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతిస్తున్నాయంటూ ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

pakistan on Raja Singh Prophet remarks
pakistan on Raja Singh Prophet remarks

By

Published : Aug 24, 2022, 3:48 PM IST

Updated : Aug 24, 2022, 4:00 PM IST

సస్పెన్షన్​కు గురైన తెలంగాణ భాజపా ఎమ్మెల్యే టీ రాజాసింగ్​ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్ వ్యాఖ్యలను పొరుగు దేశం పాకిస్థాన్ తప్పుబట్టింది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా భాజపా నేతలు చేస్తున్న వరుస కామెంట్లను అడ్డుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. "మహ్మద్ ప్రవక్తపై మూడు నెలల వ్యవధిలో భాజపా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ పౌరులతో పాటు, ప్రపంచంలోని కోట్లాది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి" అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

రాజాసింగ్​పై భాజపా తీసుకున్న క్రమశిక్షణా చర్యలపైనా పాక్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని విమర్శించింది. భాజపా తీసుకున్న చర్యలు భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎదుర్కొన్న బాధను తగ్గించలేవని చెప్పుకొచ్చింది. రాజాసింగ్​ను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే బెయిల్​పై విడుదల చేయడాన్ని ఖండించింది. దీనిపై తక్షణమే, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్​ను భాజపా నుంచి పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ రాజ్యాంగానికి, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ఈ చర్యలు తీసుకుంది. మూడు నెలల క్రితం భాజపా ప్రతినిధి నుపుర్ శర్మ ఇలాంటి వివాదంలోనే చిక్కుకోగా.. అప్పుడు సైతం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. నుపుర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇస్లామిక్ దేశాలు నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.

Last Updated : Aug 24, 2022, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details