ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన రేడియోధార్మిక క్యాప్సూల్ ఎట్టకేలకు దొరికింది. న్యూమాన్, మైనింగ్ పట్టణంలోని గ్రేట్ నార్తర్న్ హైవేపై క్యాప్సూల్ కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. క్యాప్సూల్ నుంచి వెలువడే రేడియేషన్‌ను గుర్తించే ప్రత్యేక పరికరాల ద్వారా దాని ఆచూకీ తెలుసుకున్నట్లు వెల్లడించారు. హైవేపైనే ఆరు రోజులు గాలింపులు జరిపిన అనంతరం ఇది దొరికినట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారుల బృందం 70 కిలోమీటర్ల వేగంతో గ్రేట్ నార్తర్న్ హైవేపై వాహనంలో వెళుతున్న సమయంలో.. క్యాప్యూల్ రేడియేషన్‌ను ప్రత్యేక పరికరాలు పసిగట్టాయి. దీంతో అక్కడే వాహనం నిలిపిన అధికారులు.. రోడ్డు పక్కన రెండు మీటర్ల దూరంలో పడి ఉన్న క్యాప్యూల్ను స్వాధీనం చేసుకున్నారు.
కొన్ని రోజులు క్రింత కనిపించకుండా పోయిన ఈ చిన్న క్యాప్సూల్.. ఆస్ట్రేలియా అధికారులను హడలెత్తిచింది. దీనికి కారణం.. అందులో రేడియో ధార్మికత పదార్థం 'సీజియం- 137' ఉండటమే. దీనిని మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. రేడియేషన్ నేపథ్యంలో ఆ గుళికను తాకడం లేదా దగ్గర ఉంచుకోవడం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని, కాలిన గాయాలవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అటువంటి వస్తువు ఏదైనా కనిపిస్తే దూరంగా ఉండాలని కాప్యూల్ పోయిన సమయంలో అధికారులు ప్రజలకు సూచించారు.